ఈ ఏడాది ఇప్పటివరకు 90 ఇష్యూలు
ఫీజుల కింద రూ. 3,500 కోట్లు
టాప్ 10 ఇష్యూల నుంచి రూ. 1,315 కోట్లు
ఐపీవో పరిమాణంలో 1 శాతం నుంచి 5 శాతం వరకు వసూలు
సాక్షి, బిజినెస్ డెస్క్: ఒకదాని తర్వాత మరొకటిగా లైన్ కట్టిన పబ్లిక్ ఇష్యూలతో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల (ఐ–బ్యాంకులు) పంట పండుతోంది. ఫీజుల రూపంలో భారీ రాబడులతో అవి పండగ చేసుకుంటున్నాయి. గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 90 పైగా ఇన్ఫిషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) వచ్చాయి.
కంపెనీలు వీటి ద్వారా సుమారు రూ. 1.50 లక్షల కోట్లు సమీకరించాయి. సాధారణంగా ఇష్యూలకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించే సంస్థలు సుమారు 1 శాతం నుంచి 8 శాతం వరకు ఫీజులు తీసుకుంటాయి.
ఐపీవోల ద్వారా కంపెనీలు సమీకరించిన నిధులను బట్టి చూస్తే ఐ–బ్యాంకుల ఫీజులు దాదాపు రూ. 3,500 కోట్లకు పైగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకా ఈ ఏడాది ముగియడానికి మరో నెలన్నర వ్యవధి మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. గతేడాది కూడా ఐపీవోలు వెల్లువెత్తిన నేపథ్యంలో దాదాపు ఇదే స్థాయిలో రూ. 3,500 కోట్ల వరకు ఐ–బ్యాంకులకు ఫీజుల రూపంలో ముట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
భారీ ఇష్యూల సందడి
ఈ ఏడాది వరుసగా భారీ పబ్లిక్ ఇష్యూలు క్యూ కట్టాయి. వీటిలో టాటా క్యాపిటల్, ఎల్‌జీ ఇండియా, హెక్సావేర్ టెక్, బిలియన్ బ్రెయిన్స్ మొదలైన ఇష్యూలు ఉన్నాయి. ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం టాటా క్యాపిటల్ రూ. 15,512 కోట్లు సమీకరించగా లీడ్ మేనేజర్లకు రూ. 159 కోట్లు ఫీజుల కింద ముట్టాయి.
హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 12,500 కోట్ల ఇష్యూని నిర్వహించిన సంస్థలు సుమారు రూ. 104 కోట్లు దక్కించుకోగా, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తమ రూ. 11,605 కోట్ల ఐపీవోకి రూ. 226 కోట్లు చెల్లించింది.
ఇక టెక్నాలజీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ రూ. 8,750 కోట్లు సమీకరించగా ఫీజుల కింద రూ. 215 కోట్లు చెల్లించింది. అటు గ్రో మాతృసంస్థ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ రూ. 6,632 కోట్ల ఇష్యూకి గాను మర్చంట బ్యాంకర్లకు రూ. 152 కోట్లు ముట్టజెప్పగా, లెన్స్‌కార్ట్ రూ. 7,278 కోట్ల ఇష్యూకి రూ. 129 కోట్ల మొత్తాన్ని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులకు చెల్లించింది. ఇలా మొత్తం మీద రూ. 76,210 కోట్లు సమీకరించిన టాప్ 10 సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లకు రూ. 1,315 కోట్లు ముట్టచెప్పాయి.
అనుకూల పరిస్థితులు..
దేశీయంగా మ్యుచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు ప్రవహిస్తుండటం, అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్టార్టప్స్‌లో వాటాలను లాభాలకు అమ్ముకుని వీలైనంత త్వరగా నిష్క్రమించేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ తొందరపడుతుండటం లాంటి అంశాలు ప్రస్తుతం పబ్లిక్ ఇష్యూల వెల్లువకు కారణంగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు తెలిపారు.
వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, జీడీపీ వృద్ధి, సెకండరీ మార్కెట్లు పటిష్టంగా ఉండటం వల్ల కూడా ఐపీవోల్లోకి సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు గణనీయంగా వస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఐపీవో బూమ్‌తో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చిన చాలా మటుకు కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు సాధారణంగా కంటే అధిక ఫీజులే చెల్లించినట్లు తెలిపారు. ఇష్యూ ధరను ఆకర్షణీయంగా నిర్ణయించడం, కచ్చితంగా ఓవర్ సబ్‌్రస్కయిబ్ కావడం, లిస్టింగ్‌లో లాభాలు వస్తుండటంలాంటి అంశాల వల్ల నిధుల సమీకరణకు మార్కెట్లు మంచి మార్గంగా మారాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
సెకండరీ మార్కెట్లో ట్రేడవుతున్న పోటీ సంస్థల ధరలతో పోలిస్తే ఐపీవో రేటు సుమారు 20–30 శాతం వరకు తక్కువగా ఉండటం ఆకర్షణీయాంశంగా ఉంటుంది. దీనివల్ల – సంస్థలకు పెట్టుబడులు, ఇన్వెస్టర్లకు మార్కె ట్లో ఎంట్రీ, బ్యాంకులకు ఫీజులు – ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. దీనితో సానుకూల పరిస్థితులను సొమ్ము చేసుకునే దిశగా ఈ ఏడాది ఆర్థిక సేవలు, టెక్నాలజీ నుంచి కన్జూమర్ రిటైల్ వరకు వివిధ రంగాలకు చెందిన సంస్థలు పెద్ద ఎత్తున ఐపీవోలకు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. దీనితో బ్యాంకర్లు కూడా బిజీగా మారారని, ఐపీవోలు చేపట్టేలా మరిన్ని కంపెనీలకు భరోసానిస్తున్నారని వివరించాయి.
ఇష్యూ సైజును బట్టి ఫీజులు..
ఐపీవో విజయవంతమయ్యేందుకు చేసే ప్రయత్నాలకు గాను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు, మర్చంట్ బ్యాంకులు ఇలా ఫీజులు వసూలు చేస్తుంటాయి. సాధారణంగా ఇష్యూ పరిమాణం, అలాగే బ్యాంకరు రకాన్ని బట్టి ఫీజులు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 10 కోట్ల లోపు చిన్న, మధ్యతరహా సంస్థల (ఎస్‌ఎంఈలు) ఇష్యూలపై ఇది దాదాపు 8–10 శాతం, కొన్ని సందర్భాల్లో 15 శాతం వరకు ఇది ఉంటోంది. చిన్న ఐపీవోలకు ప్రాసెసింగ్ ఫీజుల్లాంటివి రూ. 25,000 నుంచి రూ. 50,000 వరకు ఉంటుండగా, ఇతరత్రా అండర్‌రైటింగ్ ఫీజులు, లీగల్, రెగ్యులేటరీ, ఆడిట్, లిస్టింగ్ ఫీజులు మొదలైనవెన్నో ఉంటాయి.
పెద్ద కంపెనీలకు సంబంధించి, ఇష్యూ సైజు రూ. 1,000 కోట్ల వరకు ఉంటే ఫీజులు సుమారు 3–35 శాతం శ్రేణిలో ఉంటుంది. డీల్ సైజు రూ. 2,000 కోట్లు, రూ. 5,000 కోట్ల స్థాయిలో పెరిగే కొద్దీ ఫీజు శాతాల రూపంలో తగ్గినా, అంతిమంగా ఎక్కువగానే ఉంటుంది. దశాబ్దకాలం క్రితం చాలా మటుకు పబ్లిక్ ఇష్యూలపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లకు సుమారు 1–2 శాతమే ఫీజులు వచ్చేవి. ఇక భారీ ఇష్యూలకైతే ఇది మరింత తక్కువగా 0.5 – 1 శాతం శ్రేణిలో ఉండేది. ఈ ఏడాది సెకండరీ మార్కెట్ కూడా మెరుగ్గా ఉండటం, ఐపీవోల జోరు కొనసాగుతుండటంతో మధ్య స్థాయి ఇష్యూలపై ఫీజులు 2–2.5 శాతం స్థాయికి, భారీ డీల్స్‌పై 1.75 శాతం స్థాయికి పెరిగాయి.
కొన్ని ఇష్యూలు.. బ్యాంకర్లు..
ఎల్‌జీ ఇండియాకి మోర్గాన్ స్టాన్లీ, యాక్సిస్, జేపీ మోర్గాన్, బీవోఎఫ్‌ఏ, సిటీ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి. అటు టాటా క్యాపిటల్‌కి కోటక్, యాక్సిస్, బీఎన్‌పీ, సిటీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ఎస్‌బీసీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్‌ఎల్, జేపీ మోర్గాన్, ఎస్‌బీఐ సేవలందించాయి. ఇక బిలియన్ బ్రెయిన్స్‌కి కోటక్, జేపీ మోర్గాన్, సిటీ, యాక్సిస్, మోతీలాల్ సర్వీ సులు అందించగా.. లెన్స్‌కార్ట్ సొల్యూషన్‌కి కోటక్, మోర్గాన్ స్టాన్లీ, ఎవెండస్, సిటీ, యాక్సిస్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి.


