కళ్లు చెదిరేలా లాభాల్ని తెచ్చి పెట్టే ఈ 'ఈక్విటీ ఫండ్‌' గురించి మీకు తెలుసా? | Sbi Focused Equity Fund Growth Review | Sakshi
Sakshi News home page

కళ్లు చెదిరేలా లాభాల్ని తెచ్చి పెట్టే ఈ 'ఈక్విటీ ఫండ్‌' గురించి మీకు తెలుసా?

Nov 20 2023 8:12 AM | Updated on Nov 20 2023 8:16 AM

Sbi Focused Equity Fund Growth Review - Sakshi

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉన్న ఎన్నో విభాగాల్లో ఫోకస్డ్‌ ఫండ్స్‌ కూడా ఒకటి. మెరుగైన రాబడులు కోరుకునే వారు ఫోకస్డ్‌ ఫండ్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవచ్చు. ఈ పథకాలు తమ పోర్ట్‌ఫోలియోలో పరిమిత స్టాక్స్‌నే కలిగి ఉంటాయి. అంటే సత్తా ఉన్న కొన్ని కంపెనీల్లోనే తమ పెట్టుబడులను పరిమితం చేస్తాయి. కనుక వీటిల్లో పెట్టుబడులపై అధిక రిస్క్‌ ఉంటుంది. అదే మాదిరిగా అధిక రాబడులకూ అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్‌ అవుతుంది.  

రాబడులు  
దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 15.53 శాతం రాబడినిచ్చింది. కానీ, ఇదే కాలంలో బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ రాబడి 13.49 శాతంగానే ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం 19 శాతం, ఐదేళ్లలో 16 శాతం, ఏడేళ్లలో 15.41 శాతం, పదేళ్లలో 18 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు వార్షిక ప్రతిఫలాన్ని అందించింది. దీర్ఘకాలంలో ఫ్లెక్సీక్యాప్‌ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే 2 శాతం అదనపు రాబడి ఉంది. కనుక ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం సిప్‌ రూపంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు. 

పెట్టుబడుల విధానం 
ఫోకస్డ్‌ విభాగం అంటే ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌పైనే  ప్రత్యేక దృష్టి పెట్టడం. ఈ విభాగంలో ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ నమ్మకమైన పనితీరు ప్రదర్శిస్తోంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ఫోకస్డ్‌ ఈక్విటీ పథకాల్లో సుదీర్ఘ ట్రాక్‌ రికార్డు ఈ పథకం సొంతం. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్‌ వరకు నిర్వహిస్తుంటుంది. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్‌ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 22 స్టాక్స్‌ ఉన్నాయి. టాప్‌ 10 స్టాక్స్‌లోనే 60 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. 

పోర్ట్‌ఫోలియో 
పెట్టుబడుల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 38 శాతం పెట్టుబడులను వీటికే కేటాయించింది. ఆ తర్వాత సేవల రంగ కంపెనీల్లో 11 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. కన్జ్యూమర్‌ స్టాపుల్స్‌ 10 శాతం, కమ్యూనికేషన్‌ కంపెనీల్లో 9 శాతం, హెల్త్‌కేర్‌ రంగ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది.  ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.29,317 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.

ఇందులో రూ.95.61 శాతం మేర ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టింది. మిగిలిన మొత్తం నగదు రూపంలో కలిగి ఉంది. పెట్టుబడుల్లో 81 శాతం లార్జ్‌క్యాప్‌ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో 17 శాతం, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో 2 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడుల్లో కొంత మేర విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గూగుల్‌ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్‌ ఐఎన్‌సీ క్లాస్‌ఏ షేర్లలో 7 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈ తరహా స్టాక్స్‌ ఎంపిక వల్లే ఈ పథకానికి దీర్ఘకాలంలో మంచి రాబడుల చరిత్ర ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement