వాహనాలకు స్పీడ్‌ బ్రేకర్లుగా సీఎన్‌జీ ధర | Rising Gas Prices Have Constrained Cng Penetration In Commercial Vehicles To 9 To 10 Percent | Sakshi
Sakshi News home page

వాహనాలకు స్పీడ్‌ బ్రేకర్లుగా సీఎన్‌జీ ధర

Dec 10 2022 10:00 AM | Updated on Dec 10 2022 10:04 AM

Rising Gas Prices Have Constrained Cng Penetration In Commercial Vehicles To 9 To 10 Percent   - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్‌ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్‌జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది.

 మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్‌జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్‌జీ, డీజిల్‌ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్‌జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్‌జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. 

ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్‌ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్‌జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్‌ ఇంధనంపైనా ఫోకస్‌ చేస్తున్నాయి. సీఎన్‌జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్‌జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి.  

పెరిగిన నిర్వహణ ఖర్చులు.. 
సీఎన్‌జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్‌జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్‌ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్‌జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్‌జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి.

ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్‌–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్‌జీ ఆధారిత ప్యాసింజర్‌ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement