breaking news
penetration
-
వాహనాలకు స్పీడ్ బ్రేకర్లుగా సీఎన్జీ ధర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర వాణిజ్య వాహన పరిశ్రమ వేగానికి కళ్లెం వేస్తోందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఇక్రా ప్రకారం.. గ్యాస్ ధర దూసుకెళ్తుండడంతో వాణిజ్య వాహనాల్లో సీఎన్జీ విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 నుంచి 9–10 శాతానికి పరిమితం చేసింది. మధ్యస్థాయి వాణిజ్య వాహన విభాగంలో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ఇంధన ధరల పెరుగుదల కారణంగా గత ఏడాదిలో సీఎన్జీ ధర 70 శాతం అధికమైంది. ఇది సీఎన్జీ, డీజిల్ మధ్య అంతరాన్ని తగ్గించింది. దీంతో పర్యావరణ అనుకూల ఇంధనానికి మారడానికి అడ్డుగా పరిణమించింది. కొన్ని నగరాల్లో సీఎన్జీ ధర కేజీ రూ.59 ఉంటే మరికొన్ని నగరాల్లో రూ.90 ఉంది. ధరల వ్యత్యాసం సీఎన్జీ విస్తృతికి అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ప్రత్యామ్నాయ ఇంధనం/సాంకేతిక వాహనాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఎంపిక చేసిన విభాగాలలో ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడంతోపాటు, సీఎన్జీ మోడళ్ల ప్రవేశ వేగాన్ని తగ్గించాయి. హైడ్రోజన్ ఇంధనంపైనా ఫోకస్ చేస్తున్నాయి. సీఎన్జీ వ్యాప్తిలో ఇటీవలి క్షీణత కనిపించినప్పటికీ.. సీఎన్జీ ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పర్యావరణ అనుకూల వాహనాలను పెంచడం ద్వారా మధ్యకాలిక అవకాశాలు అనుకూలంగానే ఉన్నాయి. పెరిగిన నిర్వహణ ఖర్చులు.. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల వాటా 2021–22లో 38 శాతం ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 27 శాతానికి వచ్చింది. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు గత ఏడాది కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి కొన్ని నగరాల్లో పోల్చదగిన డీజిల్ వేరియంట్లతో చూస్తే ఇప్పుడు వ్యయాలు 5–20 శాతం అధికం అయ్యాయి. వాహనం ధర అధికం కావడం, సీఎన్జీ ట్రక్కులు తక్కువ బరువు మోసే సామర్థ్యం ఉండడం.. వెరశి ఈ వాహనాలను స్వీకరించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల అమ్మకాలు ఒకానొక స్థాయిలో నెలకు 12,000 యూనిట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇది 7,000 యూనిట్లకు వచ్చి చేరింది. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, ముఖ్యంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధ ప్రభావం కారణంగా ప్రస్తుత పరిస్థితి దాదాపు మధ్యస్థ కాలానికి కొనసాగుతుంది. కాగా, సీఎన్జీ ఆధారిత ప్యాసింజర్ వాహనాలు, బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం పెరిగేందుకు ప్రభుత్వ చొరవ కొంత వరకు తోడ్పడింది. -
ఏటీఎంలకు ‘ఎక్స్పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకబడి ఉంది. వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా హెచ్చరించింది. -
‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఆధునీకరించిన ‘బ్రహ్మోస్’ సూపర్సోనిక్ క్షిపణిని సోమవారం భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో కొత్త గెడైన్స్ వ్యవస్థను అమర్చిన ‘బ్రహ్మోస్’ బ్లాక్-3 వేరియంట్‌ను ఉదయం 10.55 గంటలకు పరీక్షించారు. క్లిష్టమైన లక్ష్యాలను ఛేదించడంలో చేపట్టిన ఈ పరీక్ష విజయవంతమైందని ‘బ్రహ్మోస్’ అధికారులు తెలిపారు. పరీక్ష కోసం లక్ష్యాలుగా ఏర్పాటు చేసిన కాంక్రీట్ నిర్మాణాలను ఈ క్షిపణి ధ్వంసం చేయగలిగిందని చెప్పారు. ‘బ్రహ్మోస్’ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తనతో 300 కిలోల బరువు గల సంప్రదాయక ఆయుధాలను మోసుకుపోగలదు. లెఫ్టినెంట్ జనరల్ అమిత్ శర్మ సమక్షంలో ‘బ్రహ్మోస్’ అధికారులు ఈ క్షిపణిని పరీక్షించారు. ఆర్మీ, నేవీలలో ‘బ్రహ్మోస్’ క్షిపణిని ఇప్పటికే ప్రవేశపెట్టారు.