దేశంలో డేటా విప్లవం, 6ఏళ్లు పూర్తి చేసుకున్న జియో

Reliance Jio Completes Six Years Of Telecom Service - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మొబైల్‌ ఇంటర్‌నెట్‌ విప్లవానికి తెరతీసిన రిలయన్స్‌ జియో సోమవారంతో (5వ తేదీ) ఆరేళ్లు పూర్తి చేసుకుంటోంది. జియో రాక ముందు సగటున ఒక మొబైల్‌ కస్టమర్‌ ఒక నెలలో 154 ఎంబీ డేటాను మాత్రమే ఉపయోగించగా, ఇప్పుడు అది నెలకు 15.8 జీబీ స్థాయికి చేరుకుంది. డేటా వినియోగం వంద రెట్లు పెరగడంలో జియో పాత్ర కీలకమని చెప్పుకోవాలి.

అంతేకాదు, గతంలో ఒక జీబీ డేటాకు రూ.200కు పైన ఖర్చు చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు రూ.7–15కే జీబీ డేటా వస్తోంది. ఇక వచ్చే దీపావళి నుంచి 5జీ సేవల ప్రారంభానికి జియో సన్నద్ధమవుతోంది. 2023 చివరికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 

4జీతో పోలిస్తే 5జీ సేవల వేగం ఎంతో ఎక్కువ. దీంతో 5జీ తర్వాత మూడేళ్ల కాలంలో డేటా వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని విశ్లేషకుల అంచనా. డేటా ఆధారిత కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ రాకతో వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. 41.30 కోట్ల కస్టమర్లతో టెలికం మార్కెట్లో జియో వాటా 36 శాతంగా ఉంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top