కేజీ డీ6 ఎంజే ఫీల్డ్‌లో రిలయన్స్‌ గ్యాస్‌ ఉత్పత్తి

Reliance Industries to commence deep-sea gas production from MJ field - Sakshi

ఈ త్రైమాసికంలోనే ఆరంభం

న్యూఢిల్లీ: కేజీ డీ6 పరిధిలోని అత్యంత లోతైన సముద్రపు బ్లాక్‌ ఎంజే ఫీల్డ్‌ నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సహజ వాయువుని ఈ త్రైమాసికంలోనే ఉత్పత్తి చేయనుంది. ఏకైక డీప్‌ వాటర్‌ బ్లాక్‌ అయిన కేజీ డీ6 దేశ గ్యాస్‌ అవసరాల్లో 15 శాతాన్ని తీరుస్తుండడం విశేషం. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 20 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యుబిక్‌ మీటర్స్‌ రోజువారీ (ఎంఎంఎస్‌సీఎండీ) ఉత్పత్తి సగటున ఇక్కడ నమోదైంది.

ఎంజే డీప్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి మొదలైతే దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బ్రిటన్‌కు చెందిన బీపీతో కలసి ఇక్కడ ఉత్పత్తిని ఆరంభించనుంది. వాస్తవానికి గడిచిన డిసెంబర్‌ త్రైమాసికంలోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా, మూడు నెలల జాప్యం నెలకొంది. కేజీ డీ6లో మూడు ప్రాజెక్టుల ద్వారా గ్యాస్‌ ఉత్పత్తిపై రిలయన్స్, బీపీ 5 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి.

మూడు ప్రాజెక్టులకు గాను ఆర్‌ క్లస్టర్, శాటిలైట్‌ క్లస్టర్‌లో ఇప్పటికే ఉత్పత్తి ఆరంభమైంది. ఎంజే ఫీల్డ్‌లో ఉత్పత్తి మొదలు కావాల్సి ఉంది. ‘‘ఎంజే ఫీల్డ్‌లో పరీక్షలు, ఉత్పత్తి మొదలు పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి మొదలైతే కేజీ డీ6 పరిధిలో మొత్తం గ్యాస్‌ ఉత్పత్తి 30 ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుంది’’అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top