
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన 'ముఖేష్ అంబానీ' వరుసగా ఐదవ సంవత్సరం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
2009 నుంచి 2020 వరకు అంబానీ తన వార్షిక వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ తరువాత కరోనా మహమ్మారి సమయంలో స్వచ్ఛందంగా తాను జీతం తీసుకోకూడని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే నిర్ణయానికి కట్టుబడిన ముకేశ్ అంబానీ.. జీతం తీసుకోవడం మానేశారు.
జీతం తీసుకోకపోయినా.. ముకేశ్ అంబానీ ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు. ఈయన నికర విలువ 103.3 బిలియన్ డాలర్లు. కంపెనీ నుంచి జీతం మాత్రమే కాకుండా.. ఇతర ఏ అలవెన్సులను కూడా ముకేశ్ అంబానీ తీసుకోవడం లేదు. అయితే ఆయన ప్రయాణం, ఇతర వ్యాపార ప్రకటనలు, ఇంటికి భద్రత మొదలైనవన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది.
ఇదీ చదవండి: ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి
'రిలయన్స్ ఇండస్ట్రీస్'లో అంబానీ ఫ్యామిలీ వాటా 50.33 శాతం. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుకు రూ. 10 డివిడెండ్ చెల్లించింది. దీనితో 332.27 కోట్ల షేర్లు ఉన్న అంబానీ ఫ్యామిలీకి డివిడెండ్ రూపంలో రూ. 3322.7 కోట్లు వచ్చాయి. అంబానీ జీతం తీసుకోకపోయినా.. డివిడెండ్ రూపంలో భారీ మొత్తం వస్తూనే ఉంటుంది.