
రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ నిర్వంహించిన ''నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో''ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పురోగమక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు హైదరాబాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయని తెలిపారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు.
రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇటీవల ఎకరం స్థలం రూ.177 కోట్లకు అమ్ముడు పోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లభించడం పెట్టుబడిదారులు, రియల్టర్ల విశ్వాసాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, పర్యాటక రంగాలు పరస్పరం మద్దతుగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్, నారెడ్కో ప్రెసిడెంట్ విజయ్ సాయి మేక, జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, కిరణ్, నారేడ్కో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పీఎస్ రెడ్డి, ఎం. వెంకయ్య చౌదరి, పి.రవిరెడ్డి, స్వామీనాథన్, కాళీప్రసాద్, వెంకటేష్, హరిబాబు, దశరథ్ రెడ్డి, కిరణ్ ఇతర బిల్డర్లు, ప్రమోటర్లు తదితరులు పాల్గొన్నారు.