
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం(హెచ్1)లో 2.68 కోట్ల చ.అ. స్థలం లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంలో జరిగిన 1.90 కోట్ల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఏడాది కాలంలో ఏకంగా 40 శాతం లీజులు పెరిగాయి.
అలాగే 2025 హెచ్1లో టాప్–7 నగరాలలో కొత్తగా 2.45 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది హెచ్1లో సప్లయి అయిన 1.96 కోట్ల చ.అ.తో పోలిస్తే ఏడాది కాలంలో 25 శాతం సరఫరా పెరిగిందని అనరాక్ తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో 2025 హెచ్1లో 42 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది.
గతేడాది హెచ్1లో 31.2 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే 35 శాతం లావాదేవీలు పెరిగాయి. ఇక, ఇదే సమయంలో గ్రేటర్‌లో కొత్తగా 47 లక్షల చ.అ. ఆఫీసు స్థలం సరఫరా అయింది. 2024 హెచ్1లో సప్లయి అయిన 56.8 లక్షల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఏడాది కాలంలో సరఫరా 17 శాతం మేర తగ్గింది.