
వ్యక్తిగత, గృహ, వ్యాపార రుణాల గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని ఫ్లోటింగ్-రేట్ రుణాలకు వర్తించే ప్రీ-పేమెంట్ ఛార్జీలను రద్దు చేసింది. గృహ రుణాలు, వ్యాపార అవసరాల కోసం తీసుకున్నవి, వ్యక్తులు, ఎంఎస్ఈలు పొందిన రుణాలన్నింటికీ ఆర్బీఐ కొత్త నిబంధన వర్తిస్తుంది. 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత మంజూరు చేసే లేదా పునరుద్ధరించే రుణాలు, అడ్వాన్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.
ఈ మేరకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు (కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, అఖిల భారత ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన ఏదైనా ఫ్లోటింగ్ రేటు టర్మ్-లోన్‌పై జప్తు ఛార్జీలు / ప్రీ-పేమెంట్ పెనాల్టీలను విధించడానికి వీల్లేదని ఆర్బీఐ సర్క్యులర్ తెలిపింది. ఎంఎస్ఈలకు సులభమైన, సరసమైన ఫైనాన్సింగ్ లభ్యత అత్యంత ముఖ్యమైనదని తెలిపింది.
ఎంఎస్ఈలకు మంజూరు చేసిన రుణాల విషయంలో ముందస్తు చెల్లింపు ఛార్జీల విధింపునకు సంబంధించి నియంత్రిత సంస్థల (ఆర్ఈ) మధ్య భిన్నమైన పద్ధతులను ఆర్బీఐ పర్యవేక్షక సమీక్షల్లో గుర్తించింది. దీనిపై ఫిర్యాదులు, వివాదాలు కూడా వెల్లువెత్తాయి. ముసాయిదా సర్క్యులర్‌పై వచ్చిన స్పందన, ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పుడు ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది.