
నగదు లభ్యత పెంపు అనుకూలిస్తుంది
ఫిచ్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ: వ్యవస్థలో నగదు లభ్యత పెంపు దిశగా ఆర్‌బీఐ ఈ ఏడాది ఆరంభం నుంచి తీసుకున్న చర్యలు.. 100 బేసిస్ పాయింట్ల (ఒక శాతం) రేట్ల తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని బ్యాంక్‌లు బదిలీ చేసేందుకు అనుకూలిస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు రూపంలో ఆర్‌బీఐ రూ.5.6 లక్షల కోట్ల మేర లిక్విడిటీని పెంచినట్టు గుర్తు చేసింది.
దీంతో మార్చి నుంచి నగదు లభ్యత మిగులు స్థాయికి చేరినట్టు తెలిపింది. సీఆర్‌ఆర్‌ను (నగదు నిల్వల నిష్పత్తి) 100 బేసిస్ పాయింట్లను తగ్గించడం రూపంలో మరో రూ.2.7 లక్షల కోట్ల నగదు దశల వారీగా వ్యవస్థలోకి చేరుతుందని పేర్కొంది.
జనవరి నుంచి వ్యవస్థలో లిక్విడిటీని గణనీయంగా పెంచడమే కాకుండా, భవిష్యత్తులోనూ తగినంత లిక్విడిటీని కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం నిధుల పరమైన పరిస్థితులను సులభతరం చేసినట్టు వివరించింది. ‘‘పెరుగుతున్న మిగులు నిధులు, డిపాజిట్ రేట్లు తగ్గుతుండడం దీన్ని స్పష్టం చేస్తోంది. రుణ వృద్ధి మందగించడంతో ఈ రంగం రుణ/డిపాజిట్ రేషియో పెరుగుదల తిరోగమించడం డిపాజిట్ల పరంగా బ్యాంక్‌లపై ఒత్తిళ్లను తగ్గిస్తుంది’’అని ఫిచ్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది.
నిధుల వ్యయాలు దిగొస్తాయి..
ఈ ఏడాది వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఒక శాతం వరకు తగ్గించడం తెలిసిందే. ఫిబ్రవరిలో పావు శాతం, ఏప్రిల్‌లోనూ పావు శాతం, జూన్‌లో అరశాతం తగ్గింపు నిర్ణయాలు తీసుకోవడాన్ని ఫిచ్ రేటింగ్స్ నివేదిక గుర్తు చేసింది. ఈ చర్యలు ఆర్‌బీఐ లిక్విడిటీ విధానంలో గణనీయమైన మార్పునకు నిదర్శనమని పేర్కొంది. నిధుల పరంగా ఒత్తిళ్లు లేకుండా రుణ వృద్ధికి ఈ చర్యలు మద్దతునిస్తాయని తెలిపింది.
‘‘తగినంత లిక్విడిటీ వల్ల తాజా నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. 2025–26 సంవత్సరంలో బ్యాంకుల మార్జిన్లు 0.30 శాతం తగ్గుతాయన్నది మా అంచనా. 2026–27లో డిపాజిట్లపై వ్యయాలు తగ్గడం ఫలితంగా మార్జిన్ల ఒత్తిళ్లు దిగొస్తాయి. తక్కువ సీఆర్‌ఆర్ కూడా ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. జూన్ సమీక్షలో ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను సైతం ఒక శాతం తగ్గించి 3 శాతం చేయడం గమనార్హం.