
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్
ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు పెట్టుబడులను ఇతోధికం చేసే మ్యాజిక్ బుల్లెట్ కాబోదని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుత తరుణంలో వడ్డీ రేట్లు అధికంగా లేవన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్‌బీఐ రేట్ల కోత ఫలితమిచ్చేందుకు సమయం పడుతుందన్నారు.
ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక శాతం మేర రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ఈ రేట్ల తగ్గింపు అంతిమంగా కంపెనీల పెట్టుబడులు పెరిగేందుకు దారితీస్తుందా? అంటూ ఓ మీడియా సంస్థ ఆయన్ను ప్రశ్నించింది. ‘కేవలం వడ్డీ రేట్లతోనే ఇది సాధ్యపడుతుందని నేను అనుకోవడం లేదు. ఒకటికి మించిన అంశాలు ఇందులో పనిచేస్తాయి. మరిన్ని రంగాల్లో పోటీని పెంచాలి. తమ సానుకూలతలను కాపాడుకునేందుకు వీలుగా పెట్టుబడులపై మరింతగా దృష్టి పెట్టే విధంగా పరిశ్రమలను ప్రోత్సహించాలి. మరిన్ని కార్పొరేట్ పెట్టుబడులు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను’అని రాజన్ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులు 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్టు కేంద్ర ప్రభుత్వ గణంకాల ఆధారంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: చందా కొచ్చర్‌పై ఆరోపణలు.. నిజం బట్టబయలు
ప్రతి ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం జూన్ నెలలో 2.1 శాతానికి దిగిరావడంతో ఆర్‌బీఐ మరిన్ని రేట్లను తగ్గించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రాజన్ నేరుగా బదులివ్వలేదు. ద్రవ్యోల్బణం పరంగా భారత్ సౌకర్యమైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పారిశ్రామిక దేశాలపై అమెరికా టారిఫ్‌ల విధింపు.. అంతిమంగా ఆయా దేశాల్లోకి అమెరికా ఉత్పత్తుల ప్రవేశం ప్రతి ద్రవ్యోల్బణానికి (ధరల పతనానికి) దారితీస్తుందన్నారు. ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం కంటే ప్రధాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నట్టు గుర్తు చేశారు.