
వీడియోకాన్ గ్రూపునకు రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినందుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ రూ.64 కోట్లు లంచం తీసుకున్నట్లు తేలింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ జులై 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వీడియోకాన్‌కు సంబంధించిన కంపెనీ ద్వారా చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ నుంచి ఈ డబ్బును తరలించినట్లు ట్రిబ్యునల్ తెలిపింది.
ఈ చెల్లింపు క్విడ్ ప్రోకో(పరస్పర ప్రయోజనాలు) కేసు అని ట్రిబ్యునల్ పేర్కొంది. దాంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బలం చేకూరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 కింద నమోదైన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, వాంగ్మూలాలను ఈడీ అందించిందని, వీటిని చట్టపరంగా ఆమోదించినట్లు అప్పిలేట్ తెలిపింది. రుణ ఆమోదం కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత నిబంధనలను ఉల్లంఘించించారని ఇవి స్పష్టంగా చూపుతున్నట్లు పేర్కొంది.
వీడియోకాన్ గ్రూప్ కంపెనీ ఎస్ఈపీఎల్ నుంచి దీపక్ కొచ్చర్ నేతృత్వంలోని నూపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఆర్పీఎల్)కు రూ.64 కోట్లు పంపినట్లు ట్రిబ్యునల్ వివరించింది. తర్వాతి రోజే వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు తేలింది. ఎన్ఆర్పీఎల్ యాజమాన్య బాధ్యతలు మొదట వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ వద్ద ఉన్నట్లు చూపించినప్పటికీ, నిజమైన నియంత్రణ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దీపక్ కొచ్చర్ వద్ద ఉందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. రుణాన్ని ఆమోదించేటప్పుడు చందా కొచ్చర్ ఈ సంబంధాలను ప్రకటించనందున నేరానికి పాల్పడినట్లు స్పష్టమవుతుందని పేర్కొంది.
ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
చందా కొచ్చర్, ఆమె కుటుంబానికి చెందిన అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి అనుమతిస్తూ 2020 నవంబర్‌లో అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన తీర్పును ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఆస్తులకు సంబంధించి తగిన ఆధారాలు లేవని అథారిటీ గుర్తించింది. కానీ ట్రిబ్యునల్ దీన్ని తీవ్రంగా విభేదించింది. అప్పటి అథారిటీ కీలక విషయాలను విస్మరించిందని పేర్కొంది. ‘న్యాయనిర్ణేత కీలకమైన భౌతిక వాస్తవాలను విస్మరించి, రికార్డులకు విరుద్ధంగా నిర్ధారణకు వచ్చింది. అందువల్ల, దాని ఫలితాలను మేము సమర్థించలేం’ అని ట్రిబ్యునల్ తెలిపింది.