హెచ్‌డీఎఫ్‌సీ కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్‌ | ICICI Bank Made Offer To Acquire HDFC Ltd Before Reverse Merger | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్‌

Jun 22 2025 5:57 AM | Updated on Jun 22 2025 5:57 AM

ICICI Bank Made Offer To Acquire HDFC Ltd Before Reverse Merger

సీనియర్‌ బ్యాంకర్‌ పరేఖ్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ కొన్నాళ్ల క్రితం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ను కొనుగోలుపై ఆసక్తి చూపింది. అందుకోసం ఆఫర్‌ కూడా ఇచ్చింది. కానీ హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ చందా కొచర్‌తో నిర్వహించిన చర్చాగోష్టి సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ మాజీ చైర్మన్, సీనియర్‌ బ్యాంకర్‌ దీపక్‌ పరేఖ్‌ ఈ విషయాలు వెల్లడించారు. 

‘ఐసీఐసీఐతోనే హెచ్‌డీఎఫ్‌సీ ప్రారంభమైంది. అలాంటప్పుడు సొంతింటికి తిరిగి రావచ్చు కదా, అని ఒకసారి మీరు ఆఫర్‌ ఇచ్చిన సంగతి నాకు గుర్తుంది. కానీ దాన్ని నేను తిరస్కరించాను. అది సముచితం కాదని చెప్పాను‘ అని పరేఖ్‌ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత నియంత్రణ నిబంధనల ఒత్తిడి కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో సంస్థను విలీనం చేశామని, ఈ విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ తమకు కొంత తోడ్పాటు అందించిందని ఆయన చెప్పారు. 

విలీనమనేది సంస్థకు మేలు చేసేది కాగా, భారీ స్థాయి బ్యాంకులు ఉండటమనేది దేశానికే మంచి చేస్తుందని పరేఖ్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భారతీయ బ్యాంకులు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా మరింత బలోపేతం కావడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 44 ఏళ్ల చరిత్ర గల హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ సంస్థ రివర్స్‌ మెర్జర్‌ ద్వారా అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రివర్స్‌ మెర్జర్‌కి ముందు దాన్ని కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతిపాదన చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్‌ ఆర్థికంగా తోడ్పాటు అందించింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement