బ్యాంకులపై ‘బెయిల్‌ అవుట్‌’ భారం!

Public sector banks strike against privatization - Sakshi

మరోవైపు భారీ ఎన్‌పీఏల పరిష్కారంలో రాయితీలు

ఇలా 13 కార్పొరేట్ల రుణ పరిష్కారాలు

దీనితో పీఎస్‌బీలకు రూ.2.85 లక్షల కోట్ల నష్టం

పైగా ప్రైవేటీకరణ ప్రణాళికలు

నిరసనగా 16, 17 తేదీల్లో సమ్మె తప్పదన్న యూఎప్‌బీయూ

హైదరాబాద్‌: నష్టాల్లో ఉన్న సంస్థల తీవ్ర మొండిబకాయిలు (ఎన్‌పీఏ) భారీ రాయితీలతో పరిష్కారం ఒకవైపు, యస్‌ బ్యాంక్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వంటి ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్లకు ‘బెయిల్‌ అవుట్లు’ మరోవైపు... ఇలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పలు విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ తీవ్ర సవాళ్లలో కూరుకుపోతోందని యూఎఫ్‌బీయూ (యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌) విమర్శించింది. దీనితోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ (పీఎస్‌బీ) ప్రైవేటీకరణ, విలీనాల వంటి ప్రతికూల నిర్ణయాలను కేంద్రం తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఆయా విధానాలకు నిరసనగా ఈ నెల 16, 17 తేదీల్లో సమ్మ తప్పదని పేర్కొంది. ఈ మేరకు యూఎఫ్‌బీయూ కన్వీనర్‌ బీ రాంబాబు విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన బ్యాంకింగ్‌ చట్టాల (సవరణ) బిల్లు 2021ని యూఎఫ్‌బీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  

► 13 కార్పొరేట్ల రుణ బకాయిలు రూ.4,86,800 కోట్లు. అయితే భారీ రాయితీలతో రూ.1,61,820 కోట్లకే రుణ పరిష్కారం జరిగింది. వెరసి బ్యాంకులకు రూ.2,84,980 కోట్ల భారీ నష్టం వాటిల్లింది.  

► సంక్షోభంలో ఉన్న ప్రైవేటు రంగ బ్యాంకులను నిధుల పరంగా గట్టెక్కించడానికి (బెయిల్‌ అవుట్‌) గతంలోనూ, వర్తమానంలోనూ ప్రభుత్వ రంగ బ్యాంకులనే వినియోగించుకోవడం జరిగింది. గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్, యునైటెడ్‌ వెస్ట్రన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ కరాద్‌లు ఇందుకు గత ఉదాహరణలుకాగా, ఇప్పుడు యస్‌బ్యాంక్‌ను రక్షించడానికి ప్రభుత్వ రంగ ఎస్‌బీఐని వినియోగించుకోవడం జరిగింది. ప్రైవేటు రంగ దిగ్గజ ఎన్‌బీఎఫ్‌సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బెయిల్‌ అవుట్‌కు ఎస్‌బీఐ, ఎల్‌ఐసీలను వినియోగించుకోవడం జరిగింది.  

► ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న యోచన సరికాదు. జన్‌ ధన్, నిరుద్యోగ యువత కోసం ముద్ర, వీధి వ్యాపారుల కోసం స్వధన్, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి యోజన వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విజయవంతానికి మెజారిటీ భాగస్వామ్యం ప్రభుత్వ రంగ బ్యాంకులదే కావడం గమనార్హం.  

► ఈ నేపథ్యంలో  ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వల్ల దేశంలోని సామాన్య ప్రజలు, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది.  

► బ్యాంకులను ప్రైవేటీకరించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే పక్షంలో, బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మెతో ఎటువంటి చర్యలకైనా దిగేందుకు బ్యాంక్‌ ఉద్యోగులు, అధికారులు  సిద్ధమవుతారు. ప్రైవేటీకరణ విధానం ప్రజల ప్రయోజనాలకు మంచిదికాదు.  

► ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణ లాభాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు తీవ్రమైన భారీ మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎన్‌పీఏల్లో  ప్రధాన వాటా పెద్ద కార్పొరేట్‌దే కావడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top