
2025–26లో 50,000 మందికి అవకాశం
ఒక్క ఎస్‌బీఐ నుంచే 20,000 మంది భర్తీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విస్తరణ నేపథ్యంలో సుమారు 50,000 మందిని భర్తీ చేసుకోనున్నాయి. ఇందులో 21,000 మంది ఆఫీసర్ స్థాయి వారు కాగా, మిగిలిన వారు క్లర్క్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఉండనున్నారు. ప్రభుత్వరంగంలో 12 బ్యాంకులు ఉండగా, ఒక్క ఎస్‌బీఐనే 20,000 మందికి అవకాశం కల్పించనుంది.
ఇందులో భాగంగా ఎస్‌బీఐ ఇప్పటికే 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంది. అలాగే, 13,455 మంది జూనియర్ అసోసియేట్స్ భర్తీని సైతం చేపట్టింది. శాఖల స్థాయిలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తాజా నియామకాలు చేపట్టినట్టు ఎస్‌బీఐ ప్రకటించడం గమనార్హం. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని శాఖల స్థాయిలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంది. ఎస్‌బీఐలో మొత్తం ఉద్యోగులు 2025 మార్చి చివరికి 2,36,226 మంది ఉన్నారు.
ఇందులో 1,15,066 మంది ఆఫీసర్ ర్యాంకుల్లోని వారే. ఉద్యోగుల వలసలను 2 శాతంలోపునకు పరిమితం చేసేందుకు ఎస్‌బీఐ చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పీఎన్‌బీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో రూ.5,500 మందిని కొత్తగా నియమించుకోనుంది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎన్‌బీ వ్యాప్తంగా 1,02,746 మంది ఉద్యోగులున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,000 మందిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియమించుకోనుంది.
సబ్సిడరీల బలోపేతంపై దృష్టి..
సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి, వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ చేయడం ద్వారా రాబడులు పెంచుకోవడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఆదేశించడం గమనార్హం. అవసరాలకు అనుగుణంగా సబ్సిడరీ సంస్థల్లో బ్యాంక్‌లు అదనపు పెట్టుబడులు పెడతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యకలాపాల విస్తరణతో సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా.