
భారత్‌లో డిజిటల్ విప్లవానికి నిదర్శనం
దేశంలో వ్యాపారాలకు అనువైన పాలసీలు
మరింత వేగవంతంగా సంస్కరణలు
సెమీకండక్టర్లు, మొబైల్, ఎల్రక్టానిక్స్ తయారీకి అపార అవకాశాలు
పెట్టుబడులకు ఇదే సరైన సమయం
ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: డిజిటల్ రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఓ కప్పు టీ రేటు కన్నా 1 జీబీ డేటా చౌకగా లభిస్తుండటం దీనికి నిదర్శనమని తెలిపారు. ఒకప్పుడు 2జీ టెలికం సర్వీసుల లభ్యత కూడా కష్టంగా ఉండేదని, ప్రస్తుతం దానికి అనేక రెట్లు మెరుగైన 5జీ సర్వీసులు దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి జిల్లాలోనూ లభిస్తున్నాయని పేర్కొన్నారు.
డేటా వినియోగంలో ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని తెలిపారు. డిజిటల్ మౌలికసదుపాయాల కల్పనపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని ప్రారంభించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపారాలకు అనువైన పరిస్థితులు మొదలైన అంశాల దన్నుతో భారత్.. పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తోందని ప్రధాని చెప్పారు.
సంస్కరణలను మరింత వేగవంతం చేస్తున్నామన్నారు. సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి తయారీకి భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని మోదీ వివరించారు. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. దీన్ని అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు, ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘తయారీ కార్యకలాపాలు మొదలుకుని సెమీకండక్టర్లు, మొబైల్స్, ఎల్రక్టానిక్స్ వరకు అన్నింటా దేశం పురోగమిస్తోంది. వివిధ రంగాల్లో స్టార్టప్‌ల సందడితో దేశీయంగా పరిస్థితులు చాలా ఆశావహంగా ఉన్నాయి. భారత్‌లో తయారీ కార్యకలాపాలకు, పెట్టుబడులు పెట్టేందుకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు ఇదే సరైన సమయం’’ అని ఆయన చెప్పారు.
రూ. 900 కోట్లతో శాట్‌కామ్ పర్యవేక్షణ వ్యవస్థ: సింధియా
దేశ స్పెక్ట్రం అసెట్స్‌ను, డేటా వనరులను పరిరక్షించే దిశగా నేషనల్ శాట్‌కామ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ. 900 కోట్లు కేటాయించిందని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. టెలికం, బ్రాడ్‌కాస్టింగ్ కలిపి భారతీయ శాట్‌కామ్ మార్కెట్ గతేడాది 4.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2033 నాటికి 14.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు చెప్పారు. 6జీ పేటెంట్లకు సంబంధించి 10 శాతం వాటా దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు సింధియా వివరించారు.
పేమెంట్ యాప్‌లతో రూ. 200 కోట్ల మోసాల నివారణ
టెలికం శాఖ రూపొందించిన ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్‌ఆర్‌ఐ) ప్లాట్‌ఫాంని ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలని బ్లాక్ చేయడం ద్వారా ఫోన్‌పే,
పేటీఎంలాంటి పేమెంట్ యాప్‌లు సుమారు రూ. 200 కోట్ల ఆర్థిక మోసాలను నివారించాయి. ఎఫ్‌ఆర్‌ఐ డేటా ప్రకారం ఈ రెండు సంస్థలు 10 లక్షలకు పైగా ఖాతాలు, వాలెట్లను ఫ్రీజ్ చేశాయి. ఫోన్‌పే సహ వ్యవస్థాపకుడు రాహుల్ చారి ఈ విషయాలు తెలిపారు.
త్వరలో శాట్‌కామ్ సర్వీసులు..: మిట్టల్
శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను ప్రారంభించడంపై యూటెల్‌శాట్ వన్‌వెబ్ కసరత్తు చేస్తోందని భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే సర్వీసులు మొదలవుతాయని పేర్కొన్నారు. మరోవైపు, సురక్షితమైన విధంగా అత్యంత నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడంపై ఆసక్తిగా ఉన్నట్లు స్టార్‌లింక్ ఇండియా మార్కెట్ యాక్సెస్ డైరెక్టర్ పరి్నల్ ఊర్ధ్వరేషే తెలిపారు. ఈ విషయంలో టెలికం శాఖతో పాటు విభాగాలన్నీ చక్కటి సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. అటు, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతూ, డిజిటల్ విప్లవంలో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు.
స్టార్టప్ వ్యవస్థకు దన్ను ..
టెలికం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్, డిజిటల్ కమ్యూనికేషన్స్ ఇన్నోవేషన్స్ స్క్వేర్ మొదలైన వాటితో స్టార్టప్ వ్యవస్థకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ప్రధాని చెప్పారు. అలాగే 5జీ, 6జీ, అధునాతన ఆప్టికల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఉపయోగపడే టెస్ట్ బెడ్స్‌కి నిధులు కూడా సమకూరుస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీకి గణనీయంగా ప్రాధాన్యం ఇస్తున్నామని, సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు కఠినతరమైన చట్టాలు చేశామని ప్రధాని చెప్పారు. మొబైల్, టెలికం, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ వ్యవస్థలవ్యాప్తంగా నెలకొన్న సరఫరా సమస్యలకి తగిన పరిష్కారాలను అందించేందుకు మన ముందు చక్కని అవకాశం ఉందని తెలిపారు. సెమీకండక్టర్ల తయారీలాంటి విభాగాల్లో భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటోందని ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 సెమీకండక్టర్ తయారీ యూనిట్ల పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు.
ఎల్రక్టానిక్స్ తయారీ విషయంలో గ్లోబల్ కంపెనీలు భారీ స్థాయిలో విశ్వసనీయంగా, భారీ స్థాయిలో సరఫరా చేయగలిగే భాగస్వాముల కోసం అన్వేíÙస్తున్నాయని .. ఆ అవకాశాలను భారతీయ కంపెనీలు అందిపుచ్చుకోవాలని సూచించారు. చిప్‌సెట్లు, బ్యాటరీలు, డిస్‌ప్లేలు, సెన్సార్లను దేశీయంగానే మరింతగా తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ తయారీ ఆరు రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ ఇరవై ఎనిమిది రెట్లు, ఎగుమతులు 127 రెట్లు పెరిగాయని ప్రధాని చెప్పారు. గత దశాబ్దకాలంలో మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో భారీ స్థాయిలో ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందన్నారు. డేటా ప్రకారం ఓ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ కంపెనీకి అవసరమైన ఉత్పత్తులను 45 భారతీయ సంస్థలు సరఫరా చేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఒక్క కంపెనీతో దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు.