10 వారాల్లో రూ.లక్ష కోట్లకు పైనే భారం
ప్రభుత్వరంగ చమురు సంస్థల పరిస్థితి
ధరలు పెంచకుండా విక్రయిస్తున్న తీరు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రోజుకు రూ.1,600–1,700 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత నుంచి 10 వారాల్లో వీటి నష్టం రూ.లక్ష కోట్లకుపైనే ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ.. దేశీయంగా వాటి ధరలను సవరించకుండా ఓఎంసీలు (బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్) విక్రయిస్తుండడంతో వాటిపై మోయలేనంత భారం పడుతోంది.
ఒకవైపు అధిక ధరలు కొనుగోలు చేసి, తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర తగ్గించడం తెలిసిందే. తద్వారా నెలకు రూ. 14,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. లేదంటే ఓఎంసీలపై ఈ నష్టం మరింతగా ఉండేది. అయితే, ఇలా ఎంత కాలం పాటు అవి ఈ స్థాయిలో భారాన్ని మోస్తాయన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను పెంచొచ్చన్న వార్తలు వినిపించాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఎంతో కొంత ధరలు పెంచక తప్పనిసరి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిత్యం వేల కోట్ల నష్టం
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జపాన్, యూకే తదితర దేశాల్లో పెట్రోల్ ధరలను 30 శాతం వరకు పెంచడం గమనార్హం. అయినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడరాదన్న కేంద్రం విధానం మేరకు.. ఇక్కడ ఓఎంసీలు గతం నుంచి ఉన్న ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. గ్యాస్ ధరలను అవి కొంత వరకు సవరించినప్పటికీ.. వాటి కొనుగోలు కంటే వసూలు తక్కువగానే ఉంది. ఫలితంగా ఈ సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,600 నుండి 1,700 కోట్ల నష్టం వాటిల్లుతోంది.
ఓఎంసీలు సొంత ఆదాయంతోనే ముడి చమురు కొనుగోలు, శుద్ధి చేపడుతుంటాయి. రోజురోజుకూ నష్టాలు పెరుగుతుండడంతో ముడి చమురు కొనుగోలు కోసం అవి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఎంత మేరకు పెంచాలి, ఎప్పుడు పెంచాలి? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందంటున్నారు.


