వ్యాపార దిగ్గజం ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ (పీఅండ్‌జీ) ఇండియా 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో భాగంగా తెలంగాణలో నీటి సంరక్షణ ప్రాజెక్టును ప్రారంభించింది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వనరులను పునరుద్ధరించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది.
మూసీ–కృష్ణా నది బేసిన్‌లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎస్‌డబ్ల్యూఏఆర్ (వ్యవసాయ పునరుద్ధరణకు తోడ్పడే నీటి వ్యవస్థ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు కంపెనీ వివరించింది. అవసరమైనంత మాత్రమే ఉపయోగించుకుని, నీరు వ్యర్ధం కాకుండా నివారించేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. దీర్ఘకాలంలో భూగర్భ జలాలను, వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ఉపయోగపడగలదని వివరించింది.
ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకున్న రెండు గ్లోబల్ సైట్లలో తెలంగాణ ఒకటని తెలిపింది. బోన్‌విల్లే ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్, సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ కన్సర్న్స్ భాగస్వామ్యంతో 100 ఎకరాల వ్యవసాయ భూమిలో దీన్ని చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. వినూత్న నీటి పారుదల విధానాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.


