Indian OTT Become Low Prices, Details Inside - Sakshi
Sakshi News home page

షరతులు వర్తిస్తాయి..: ఓటీటీ.. ఇంకాస్త చౌకగా!

Published Fri, Aug 19 2022 4:22 AM | Last Updated on Fri, Aug 19 2022 9:05 AM

OTT is available at even lower rates - Sakshi

(మంథా రమణమూర్తి)
మిగిలిన దేశాలు వేరు. ఇండియా వేరు. ఇక్కడ రేటే రాజు. నాణ్యత, సర్వీసు వీటన్నిటిదీ ఆ తరువాతి స్థానమే. ధర కాస్త తక్కువగా ఉంటే... ఓ అరకిలోమీటరు నడిచైనా వెళ్లి తెచ్చుకునే మనస్తత్వం సగటు భారతీయ వినియోగదారుది. వినోదాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇపుడిపుడే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నాయి. కోవిడ్‌ కాలంలో వీక్షకుల సంఖ్య పెంచుకోవటమే లక్ష్యంగా ఎడాపెడా ఆఫర్లిచ్చేసి... కంటెంట్‌ కోసం వందల కోట్లను ఖర్చు చేసిన ఓటీటీలు... పరిస్థితులిపుడు సాధారణ స్థాయికి రావటంతో ఆదాయంపై దృష్టి పెట్టాయి.

లాభాలు రావాలంటే సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు మాత్రమే సరిపోదనే ఉద్దేశంతో... సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నాయి. దీనికోసం ఉచితం... ప్రీమియం.. పే–పర్‌ వ్యూ వంటి పలు మోడళ్లను వీక్షకులకు అందుబాటులో ఉంచనున్నాయి. ఇదే జరిగితే... ఓటీటీ యుగంలో మరో దశ మొదలైనట్లే. వినియోగదారులకు మరింత నాణ్యమైన కంటెంట్‌... మరింత తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌కు తత్వం బోధపడింది....
ప్రపంచ ఓటీటీ రారాజు నెట్‌ఫ్లిక్స్‌లో... ఎన్నటికీ ప్రకటనలు ఉండవని సీఈఓ రీడ్‌ హేస్టింగ్స్‌ కొన్నాళ్ల కిందటి వరకూ పదేపదే చెప్పారు. 2011 నుంచీ ప్రతి ఏటా రెండంకెలకు తగ్గని ఆదాయ వృద్ధి... అసలు సబ్‌స్క్రయిబర్లు తగ్గటమనేదే లేని చరిత్ర నెట్‌ఫ్లిక్స్‌ది. అదే ధీమాతో ఇటీవల రేట్లు పెంచేసి, పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు ప్రత్యేక ఛార్జీలు విధించారు. దీంతో జనవరి–మార్చి త్రైమాసికంలో నెట్‌ఫ్లిక్స్‌కు 2 లక్షల మంది గుడ్‌బై కొట్టేశారు. ఇది ఊహించని షాక్‌. ఒక్కసారిగా షేరు పడిపోవటమే కాదు... వందల కొద్దీ ఉద్యోగాలూ పోయాయి.

ఏప్రిల్‌– జూన్‌లోనూ ఈ షాక్‌ కొనసాగింది. ఏకంగా 10 లక్షల మంది మైనస్‌ కావటంతో సంస్థ పునరాలోచనలో పడింది. సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయంపైనే ఆధారపడితే కష్టమని... అవసరమైతే చార్జీలు తగ్గించి ప్రకటనలు కూడా ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ‘ప్రకటనల విషయంలో కాస్త పరిణతి ఉన్న మార్కెట్లలో ముందు మొదలుపెడతాం’ అన్నారు రీడ్‌. యాడ్‌ మార్కెట్‌ విషయంలో ఇండియా పరిణితి చెందిందో లేదో తెలీదు గానీ.. ఇక్కడ వచ్చే ఏడాది మొదటి నుంచీ నెట్‌ఫ్లిక్స్‌ తెరపైప్రకటనలు మాత్రం కనిపించబోతున్నాయి.

అమెజాన్‌కు ఆ అవసరం లేదా?
ప్రకటనతో కూడిన వీడియో ఆన్‌ డిమాండ్‌ (ఏవీవోడీ) సేవలపై స్ట్రీమింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్‌ ఇప్పటిదాకా ఏ ప్రకటనా చేయలేదు. డిస్నీ హాట్‌స్టార్‌ ఇప్పటికే ఏవీవోడీ మోడల్‌ను అమలు చేసి భారతీయుల మది గెలుచుకుంది. నెంబర్‌–1 స్థానంతో పాటు 3.6 కోట్ల యాప్‌ డౌన్‌లోడ్స్‌తో దేశంలో అత్యధిక వాటానూ సొంతం చేసుకుంది. ఎంఎక్స్‌ ప్లేయర్, జీ, ఊట్, సోనీ లివ్, సన్‌ నెక్స్‌›్ట వంటి ఇతర స్ట్రీమింగ్‌ సంస్థలు కూడా డిస్నీ మాదిరిగా  సబ్‌స్క్రిప్షన్‌  ఆదాయం ఒక్కటే అయితే కష్టమన్న ఉద్దేశంతో ప్రకటనలకు ఎప్పుడో గేట్లు తెరిచేశాయి. యాడ్స్‌ ఆదాయం భారీగా వస్తుండటంతో ఇంతటి పోటీని సైతం  తట్టుకోగలుగుతున్నాయి.

దీనిపై ట్రస్ట్‌ రీసెర్చ్‌ అడ్వయిజరీ (ట్రా) సీఈఓ చంద్రమౌళి నీలకంఠన్‌ను ‘సాక్షి’ సంప్రతించగా.. ‘‘అవును! ధర తగ్గితే మధ్య మధ్యలో కొన్ని ప్రకటనలొచ్చినా మన ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఓటీటీ కంపెనీలు  అవసరమైన మోడళ్లను తెచ్చే పనిలోపడ్డాయి. అమెజాన్‌ మాత్రం తన ప్రైమ్‌ వీడియో తెరపై ప్రకటనలకు చోటివ్వకపోవచ్చు. ఎందుకంటే దాని ప్రధాన వ్యాపారం వీడియో కంటెంట్‌ కాదు. తన సభ్యులకిస్తున్న రకరకాల సర్వీసుల్లో ఇదీ ఒకటి. దానికి నిధుల కొరత కూడా లేదు’’ అని అభిప్రాయపడ్డారు. ఓటీటీ తెరపై ప్రకటనలు ఇపుడిపుడే పెరుగుతున్నాయని. వచ్చే ఏడాది కాలంలో దీనికొక రూపం రావచ్చని చెప్పారాయన. ‘‘ఇండియా మిగతా దేశాల్లాంటిది కాదు. ఇక్కడ ప్రాంతీయ భాషల బలం ఎక్కువ. వీడియో కంటెంట్‌లోనూ వాటికి ప్రాధాన్యముంది. అందుకే స్థానిక చానెళ్లు కూడా ప్రకటనల విషయంలో ఓటీటీలకు గట్టి పోటీనే ఇస్తాయి’’ అన్నారు.  

ఆహా... నెట్‌ఫ్లిక్స్‌ దారిలోనే
తెలుగు కంటెంట్‌కు ప్రత్యేకమైన స్ట్రీమింగ్‌ సంస్థ ‘ఆహా’ కూడా ఇపుడు ఏవీవోడీ వైపు చూస్తోంది. దీనిపై సంస్థ బిజినెస్‌ స్ట్రాటజీ హెడ్‌ రామ్‌శివ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘‘మన మార్కెట్‌ చాలా భిన్నం. తక్కువ ధరకో, ఫ్రీగానో వచ్చే కంటెంట్‌లో కొన్ని యాడ్స్‌ ఉన్నా వీక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం మరికొన్ని ప్లాన్లను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అన్నారాయన. ప్రీమియం కోరుకునేవారి కోసం ప్రస్తుత ప్లాన్లు యథాతథంగా ఉంటాయని స్పష్టంచేశారు. యాప్‌ యానీ సంస్థ 2022 నివేదికలో... దేశంలో డిస్నీ హాట్‌స్టార్‌కు 3.6 కోట్లు, అమెజాన్‌కు 1.7 కోట్ల యూజర్లు ఉన్నట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌కు 43–45 లక్షల సభ్యులుంటారనేది మార్కెట్‌ వర్గాల అంచనా.

ఇది దేశీ టాప్‌–10లోనూ లేదు. యాడ్స్‌ను స్కిప్‌ చేయాలని ఉన్నా... అందుకోసం ప్రీమియం మొత్తాన్ని వెచ్చించాలంటే మాత్రం చాలా మంది వెనకాడుతున్నారని, అందుకే ఏవీవోడీ ద్వారా ఓటీటీ సంస్థలు భారీ ఎత్తున ఆదాయాన్ని ఆర్జించనున్నాయని డెలాయిట్‌   2022 నివేదిక తెలిపింది. ‘‘ఏవీవోడీ మార్కెట్‌ మున్ముందు ఎస్‌వీవోడీని దాటిపోతుంది. 2021 లో 1.1 బిలియన్‌ డాలర్లుగా (రూ.8,800 కోట్లు) ఉన్న ఏవీవోడీ మార్కెట్‌ 2026 నాటికి 2.4 బిలియన్‌ డాలర్లకు (రూ.19,200 కోట్లు) చేరుతుంది. ఇదే సమయంలో ఎస్‌వీవోడీ మాత్రం 80 లక్షల డాలర్ల్ల (రూ.6,400 కోట్లు) నుంచి 2.1 బిలియన్‌ డాలర్లకు (రూ. 16,800 కోట్లు) చేరుతుంది’’ అని డెలాయిట్‌ అంచనా వేసింది. మొత్తంగా దేశంలో ఓటీటీ మార్కెట్‌ వచ్చే పదేళ్లలో 20% కాంపౌండింగ్‌ వృద్ధిని సాధిస్తుందని సంస్థ పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 10.2 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్లు ఉండగా 2026 నాటికి వీరి సంఖ్య 22.4 కోట్లకు చేరుతుందని డెలాయిట్‌ తెలిపింది.  

యాడ్స్‌ నుంచి ప్రీమియంవైపు కూడా...!
చేతిలో కంటెంట్‌ ఉన్నపుడు దాన్ని యాడ్స్‌తో... యాడ్స్‌ లేకుండా ఎలాగైనా చూపించవచ్చన్నది ఓటీటీ సంస్థల ఉద్దేశం. అందుకే అగ్రిగేషన్‌ సేవలు కూడా అందిస్తూ ఏవీవోడీ మార్కెట్లో చెప్పుకోదగ్గ వాటా ఉన్న ఎంఎక్స్‌ ప్లేయర్‌.... ఇటీవలే రూ.299 వార్షిక సభ్యత్వ రుసుముతో ఎంఎక్స్‌ గోల్డ్‌ పేరిట ప్రీమియం సేవలు ఆరంభించింది. ప్రస్తుతం భారతీయ ఏవీవోడీ మార్కెట్లో ఎంఎక్స్‌ ప్లేయర్, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్‌దే హవా. ఈ 3 సంస్థలకూ ఉమ్మడిగా 65 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఇవి వినోద కంటెంట్‌తో పాటు అగ్రిగేషన్, స్పోర్ట్స్‌ కూడా అందిస్తుండటం వీటికి కలిసొస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ప్లేయర్లు కూడా వస్తే ఏ మార్పులొస్తాయో తెరపై చూడాల్సిందే!.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement