విశాలమైన ఆఫీస్‌.. ఫుల్‌ డిమాండ్‌ | Office space leasing in Hyderabad Savills India report | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో 20 లక్షల చ.అ.లు పెద్ద సైజు ఆఫీసులే..

Apr 20 2025 1:18 PM | Updated on Apr 20 2025 1:27 PM

Office space leasing in Hyderabad Savills India report

గ్రేటర్‌లో క్యూ1లో 25 లక్షల చ.అ. లావాదేవీలు

ఇందులో 20 లక్షలు పెద్ద సైజు ఆఫీసులే..

సావిల్స్‌ ఇండియా నివేదిక వెల్లడి

స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్‌ ఇదే పరిస్థితి. కోవిడ్‌ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరో

హైదరాబాద్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్‌ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్‌ హెల్త్‌ కేర్‌ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్‌ రియల్‌ ఎస్టేట్‌ అడ్వైజరీ సావిల్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.

ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.

సరఫరాలో 28 శాతం వృద్ధి.. 
2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్‌లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్‌ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.

జీసీసీల జోరు.. 
ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్‌–ఏ ఆఫీసు స్పేస్‌ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్‌ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్‌ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement