యూపీఐ లైట్‌లో కొత్త ఫీచర్‌.. | NPCI introduces UPI Lite Transfer Out feature | Sakshi
Sakshi News home page

యూపీఐ లైట్‌లో కొత్త ఫీచర్‌..

Feb 28 2025 7:11 PM | Updated on Feb 28 2025 7:57 PM

NPCI introduces UPI Lite Transfer Out feature

చిన్న మొత్తాల్లో లావాదేవాలకు ఉద్దేశించిన యూపీఐ లైట్‌ (UPI Lite) సేవల్లో 'ట్రాన్స్‌ఫర్ అవుట్' అనే కొత్త ఫీచర్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తీసుకువచ్చింది. ఇందుకోసం మార్చి 31 నాటికి అవసరమైన మార్పులను అమలు చేయాలని అన్ని ఇష్యూయర్ బ్యాంకులు, పీఎస్‌పీ (పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌) బ్యాంకులు, యూపీఐ యాప్‌లను ఎన్‌పీసీఐ ఆదేశించింది.

'ట్రాన్స్ ఫర్ అవుట్' అంటే..
దాదాపు అన్ని యూపీఐ యాప్‌లలోనూ యూపీఐ లైట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. చిన్న మొత్తాలకు పిన్ ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండా వేగంగా చెల్లింపులు చేసేందుకు దీన్ని రూపొందించారు.  దీని ద్వారా చెల్లింపులు జరపాలంటే ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాలెన్స్‌ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్‌ నుంచి చెల్లింపులకు నగదు వెళ్తుంది. ఈ మొత్తాన్ని తిరిగి బ్యాంక్‌ అకౌంట్‌కు జమ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇది యూపీఐ లైట్‌ ఆప్షన్‌ ఆన్‌లో ఉంటేనే సాధ్యమయ్యేది.

తాజాగా తీసుకొచ్చిన 'ట్రాన్స్ ఫర్ అవుట్' ఫీచర్‌తో యూపీఐ లైట్‌ను డిసేబుల్ చేయకుండానే తమ యూపీఐ లైట్ బ్యాలెన్స్ నుంచి డబ్బును తిరిగి ఒరిజినల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనాలిటీ వినియోగదారులకు తమ నిధులపై మెరుగైన నియంత్రణను అందిస్తుంది. అదే సమయంలో ఇబ్బంది లేని చిన్న చెల్లింపులనూ అనుమతిస్తుంది.

నూతన మార్గదర్శకాలు
» యూపీఐ లైట్ అందించే బ్యాంకులు లైట్ రిఫరెన్స్ నంబర్ (ఎల్ఆర్ఎన్) స్థాయిలో బ్యాలెన్స్‌లను ట్రాక్ చేస్తూ  వాటిని ప్రతిరోజూ ఎన్‌పీసీఐ డేటాతో సరిపోల్చాలి.

» యాక్టివ్ యూపీఐ లైట్ ఉన్న యూపీఐ యాప్‌లలో లాగిన్ చేసేటప్పుడు పాస్ కోడ్, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ లేదా ప్యాట్రన్‌ ఆధారిత లాక్ ద్వారా ప్రామాణీకరించాల్సి ఉంటుంది.

» యూపీఐ లైట్‌ అందించే అన్ని ఇష్యూయర్ బ్యాంకులు, పీఎస్‌పీ బ్యాంకులు, యూపీఐ యాప్‌లు మార్చి 31 లోగా అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.

» ఈ మార్పులు మినహా ప్రస్తుతం ఉన్న అన్ని యూపీఐ లైట్ మార్గదర్శకాలు అలాగే ఉంటాయి. వాటిలో ఎటువంటి మార్పు ఉండదు.

పెరిగిన యూపీఐ లైట్ పరిమితి
యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచారు. అలాగే, ప్రతి లావాదేవీ పరిమితిని గతంలో ఉన్న రూ.100 నుంచి రూ.500కు పెంచారు. యూపీఐ 123పేకు ప్రతి లావాదేవీ పరిమితిని కూడా సవరించారు, ఇది గతంలో ఉన్న రూ .5,000 ఉండగా ప్రస్తుతం రూ .10,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement