ఆచితూచి రుణం..! | New loan originations slows as young borrowers decline | Sakshi
Sakshi News home page

ఆచితూచి రుణం..!

Jun 27 2025 6:13 AM | Updated on Jun 27 2025 8:24 AM

New loan originations slows as young borrowers decline

తగ్గుముఖం పట్టిన రిటైల్‌ లోన్లు...

2024–25 క్యూ4లో వృద్ధి 5 శాతమే 

రుణాల పట్ల యువత అప్రమత్తత!

ముంబై: యువత రిటైల్‌ రుణాల విషయంలో అప్రమత్తత వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024–25 క్యూ4) రిటైల్‌ రుణాల మంజూరులో కేవలం 5 శాతం వృద్ధి నమోదైనట్టు ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024 జనవరి–మార్చి) రిటైల్‌ రుణాల్లో వృద్ధి 12 శాతంగా ఉండడాన్ని ప్రస్తావించింది.

 రిటైల్‌ రుణాల వృద్ధి గణనీయంగా తగ్గడంలో కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ రుణాలు, క్రెడిట్‌ కార్డు వినియోగం ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణాల్లో యువత వీటిని ప్రధానంగా వినియోగిస్తుండడం తెలిసిందే. రిస్క్‌ అధికంగా ఉండే అన్‌సెక్యూర్డ్‌ రిటైల్‌ రుణాల్లో దూకుడు వద్దంటూ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలకు 2023 చివర్లో ఆర్‌బీఐ సూచనలు చేయడాన్ని సిబిల్‌ నివేదిక గుర్తు చేసింది. క్రెడిట్‌ కార్డు, పర్సనల్‌ రుణాల్లో వృద్ధిని మోస్తరు స్థాయికి తీసుకురావడమే ఈ చర్యల ఉద్దేశ్యంగా పేర్కొంది.  

అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి.. 
→ క్రెడిట్‌ కార్డుల జారీ సంఖ్య 2023–24 జనవరి–మార్చి త్రైమాసికంలో సున్నాగా ఉంటే, 2024–25 సంవత్సరం చివరి త్రైమాసికంలో మైనస్‌ 32%గా (తగ్గిపోవడం) నమోదైంది.  
→ వ్యక్తిగత రుణాల్లో వృద్ధి 6 శాతానికి పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే క్వార్టర్‌లో 13 శాతం వృద్ధి నమోదైంది. 
→ కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రుణాలు 2024–25 క్యూ4లో 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో వృద్ధి 19 శాతంగా ఉంది. 
→ రుణ వినియోగదారుల్లో వృద్ధి 8 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 15 శాతం.  
→ కొత్త వారికి రుణ వితరణలో వృద్ధి క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 3 శాతం తక్కువగా 16 శాతానికి పరిమితమైంది.  
→ గృహ రుణ విభాగంలో వితరణలు (సంఖ్యా పరంగా) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం తగ్గిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ గృహ రుణాల్లో రూ.కోటికి మించిన మొత్తాల్లో మాత్రం 9 శాతం వృద్ధి కనిపించింది.  
→ ఆటో విభాగంలోనూ పెద్ద మొత్తం రుణాలకు డిమాండ్‌ కనిపించింది. 
→ క్రెడిట్‌ కార్డులు మినహా రిటైల్‌ రుణాల్లోని అన్ని విభాగాల్లోనూ 90 రోజులకు పైగా చెల్లింపులు చేయని వాటి విషయంలో మెరుగుదల నమోదైంది. క్రెడిట్‌ కార్డుల్లో మాత్రం 0.28% పెరిగి ఇవి 2%కి చేరాయి.  
→ రుణాలను మొదటిసారి తీసుకునే వారిలో వృద్ధి తగ్గడం ఆందోళనకరమని.. అందరికీ ఆర్థిక సేవల విస్తృతికి ఈ విభాగం కీలకమని సిబిల్‌ ఎండీ భవేష్‌ జైన్‌ 
పేర్కొన్నారు.  

లఘు సంస్థలకు తగ్గిన కొత్త రుణాలు 
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) కొత్త రుణాలు (ఆరిజినేషన్‌) నెమ్మదించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో (2023–24) పోలిస్తే 2024–25లో విలువ 7.4 శాతం మేర క్షీణించి, రూ. 39.9 లక్షల కోట్ల నుంచి రూ. 36.9 లక్షల కోట్లకు తగ్గింది. రూ. 1 కోటి లోపు మైక్రో లోన్స్‌ ఇచ్చేందుకు రుణదాతలు దూరంగా ఉండటం ఇందుకు కొంత కారణంగా నిల్చింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రో సెగ్మెంట్‌ రుణాలు రూ. 18.2 లక్షల కోట్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.8 లక్షల కోట్లకు తగ్గాయి. పరిమాణంపరంగా చూస్తే మాత్రం ఎంఎస్‌ఎంఈలకు కొత్త రుణాల సంఖ్య 64.7 లక్షల నుంచి 75.8 లక్షలకు పెరిగింది. విలువ కోణంలో చూస్తే, రూ. 1–50 కోట్ల వరకు విలువ చేసే రుణాలు గణనీయంగా పెరిగాయి. క్రిఫ్‌ హై మార్క్‌ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

మరిన్ని వివరాలు.. 
→ చిన్న సంస్థల సెగ్మెంట్‌లో (రూ. 1–10 కోట్లు) రుణాలు రూ. 11 లక్షల నుంచి రూ. 12.1 లక్షల కోట్లకు పెరిగాయి. అలాగే మీడియం సెగ్మెంట్లో (రూ. 10–50 కోట్లు) లోన్లు రూ. 10.7 లక్షల కోట్ల నుంచి రూ. 13 లక్షల కోట్లకు ఎగిశాయి.  
→ ఈ మార్పులనేవి, రుణదాతలు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే సెగ్మెంట్‌ వైపు మళ్లుతుండటాన్ని సూచిస్తున్నాయి. 
→ రుణ బాకీల పోర్ట్‌ఫోలియో రూ. 33.6 లక్షల కోట్ల నుంచి రూ. 40.4 లక్షల కోట్లకు చేరింది. 
→ 91–180 రోజుల కాలవ్యవధిలోని మొండి బాకీల పరిమాణం 1.3 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గింది.  

Advertisement
 
Advertisement
Advertisement