యువతరం ఉద్యమిస్తోంది.. అధికారం దిగివస్తోంది! | Youth led protests in 39 countries in the last two years | Sakshi
Sakshi News home page

యువతరం ఉద్యమిస్తోంది.. అధికారం దిగివస్తోంది!

Oct 13 2026 5:39 AM | Updated on Oct 13 2026 5:39 AM

Youth led protests in 39 countries in the last two years

సోషల్‌ మీడియా నుంచి వీధిపోరాటం వరకు జెన్‌జీ పరుగులు

గత రెండేళ్లలో 39 దేశాల్లో యువత నేతృత్వంలో నిరసనలు  

సాక్షి, అమరావతి: చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. సోషల్‌ మీడియాలో ప్రచారం.. వీధుల్లో నిరసనలు.. ఇదీ నేటి యువత పోరాట తీరు. అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వాల వైఫల్యాలపై యువత గళమెత్తుతోంది. విద్యార్థులతో మొదలైన ఆందోళనలు ప్రభుత్వాలనే కదిలిస్తున్నా­యి. కొన్నిచోట్ల ప్రధానులు, అధ్యక్షులు పదవులు వదులుకోవాల్సి వస్తుండగా.. మరికొన్ని దేశాల్లో ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నాయి. మనదేశంలో నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఏకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేత రాజీనామా చేయించాయి కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని ఈ బొద్దింకలు ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానాష్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లోను జెన్‌జీ ఆందోళన నిర్వహిస్తోంది. 

ఏపీలోనూ మెగా డీఎస్సీ కుంభకోణానికి వ్యతిరేకంగా యువత తాజాగా ఉద్యమించింది.ఈ నేపథ్యంలో గేట్‌వే హౌస్‌ ఈ నెల 8న ప్రచురించిన ‘ది అవుట్‌కమ్స్‌ ఆఫ్‌ గ్లోబల్‌ యూత్‌ మూవ్‌మెంట్స్‌’ అధ్యయనం ఈ పరిణామాలపై ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 2024 జనవరి నుంచి 2026 జూన్‌ వరకు 39 దేశాల్లో యువత నేతృత్వంలో నిరసనలు నమోదైనట్లు వెల్లడించింది. వీటిలో 19 దేశాల్లో ప్రభుత్వాలు నిరసనకారుల డిమాండ్లకు కొంతమేర అంగీకరించడం, విధాన నిర్ణయాలను మార్చడం లేదా అధికారులు రాజీనామా చేయడం వంటి పరిణామాలు జరిగాయి. నాలుగు దేశాల్లో ఉద్యమాల ఫలితాలు ఇంకా తేలలేదు. అయితే కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌ (సీఎఫ్‌ఆర్‌) విశ్లేషణ ప్రకారం.. యువత ఉద్యమం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగినా, ఆ తర్వాత అవినీతిని తగ్గించడం, ఆర్థికవ్యవస్థను మెరుగుపరచడం, వ్యవస్థాగత సంస్కరణలు అమలు చేయడం వంటి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.  

బంగ్లాదేశ్‌లో పాలనకు చరమగీతం  
2024లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో విద్యార్థులు ఉద్యమం చేపట్టారు. అవినీతి, అధికార దుర్వినియోగంపై యువత గళమెత్తింది. నిరసనలు ఉధృతం కావడంతో అప్పటి ప్రధాని షేక్‌ హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆమె సుదీర్ఘపాలన ముగిసింది.  

శ్రీలంకలో అధ్యక్షుడి రాజీనామా  
2022లో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇంధనం, ఆహారం, మందుల కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ప్రభుత్వ వైఫల్యాలపై యువతతో పాటు ప్రజలు ‘అరగలయ’ పేరుతో ఉద్యమించారు. నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేశారు.  

నేపాల్‌లో జెన్‌జీ ప్రకంపనలు  
2025లో నేపాల్‌లో సోషల్‌ మీడియా వేదికలపై నిషేధం, అవినీతి, రాజకీయ నాయకుల కుటుంబాల విలాసవంతమైన జీవనశైలిపై యువత నిరసనలకు దిగింది. పోలీసుల కాల్పుల్లో నిరసనకారులు మరణించడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా నిరసనలు విస్తరించడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు.  

కెన్యాలో పన్నుల బిల్లుకు బ్రేక్‌  
2024లో కెన్యా ప్రభుత్వం ప్రతిపాదించిన పన్నుల పెంపునకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. సోషల్‌ మీడియా ద్వారా సమీకరణ, వీధుల్లో ఆందోళనలతో ప్రభుత్వం ఒత్తిడికి గురైంది. అధ్యక్షుడు విలియం రూటో ప్రతిపాదిత ఆర్థిక బిల్లును వెనక్కి తీసుకున్నారు. అనంతరం మంత్రివర్గంలో భారీ మార్పులు చేపట్టారు.  

మరికొన్ని దేశాల్లోనూ ఇదే తీరు  
ఇండోనేషియా: 2025లో ఎంపీలకు అదనపు భత్యాలపై నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలను వెనక్కి తీసుకుంది.  
మడగాస్కర్‌: నీరు, విద్యుత్‌ సమస్యలు, అవినీతిపై యువత ఆందోళనలు చేపట్టింది. నిరసనల అనంతరం అధ్యక్షుడు ఆండ్రి రాజోలినా అధికారాన్ని కోల్పోయారు.  
ఫిలిప్పీన్స్, పెరూ: 2025లో పెద్ద ఎత్తున నిరసనల నేపథ్యంలో ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారులు రాజీనామా చేసినట్లు సీఎఫ్‌ఆర్‌ విశ్లేషణ పేర్కొంది.  
తైమూర్‌–లెస్టే: పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక ప్రయోజనాలు, మాజీ ప్రజాప్రతినిధులకు జీవితకాల పెన్షన్లపై వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం ఆ ప్రయోజనాలను రద్దు చేసింది.  

యూనిసెఫ్‌ అధ్యయనంలో కీలక అంశాలు  
యూనిసెఫ్‌ ఇన్నోసెంటీ కార్యాలయం 2024 మార్చిలో ప్రచురించిన యూత్, ప్రొటెస్ట్స్‌ అండ్‌ ది పాలీక్రైసిస్‌ నివేదిక యువత నిరసనల వెనుక ఉన్న కారణాలు, వాటి ప్రభావాలను విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం..  
»  యువత సంప్రదాయ రాజకీయ మార్గాల కంటే నిరసనలు, ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతోంది.  
»  రాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ సమస్యలు యువతను ఉద్యమాల వైపు నడిపిస్తున్నాయి.  
»  డిజిటల్‌ వేదికలు నిరసనకారులను సమీకరించడంలో, సమాచారాన్ని వేగంగా వ్యాప్తిచేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.  
»  యువత భాగస్వామ్యంతో జరిగే ఉద్యమాలు ఎక్కువమందిని కలుపుకొని సాగడం, వినూత్న పద్ధతులను ఉపయోగించడం వల్ల ప్రభావవంతంగా మారే అవకాశముంది.  
»  ఉద్యమం విజయవంతమైనా యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాలు వంటి ప్రయోజనాలు అందుతాయని హామీలేదని నివేదిక హెచ్చరించింది.  

సోషల్‌ మీడియా నుంచి వీధి పోరాటం వరకు  
ప్రస్తుత యువత ఉద్యమాల్లో సోషల్‌ మీడియా కీలక సాధనంగా మారిందని గేట్‌వే హౌస్‌ అధ్యయనం పేర్కొంది. వాట్సప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్, ఎక్స్, టెలిగ్రామ్, యూట్యూబ్‌ వంటి సామాజిక వేదికల ద్వారా ప్రచారం, సమీకరణ సాగుతున్నాయని వివరించింది. అనేక ఉద్యమాలకు ఒకే నాయకత్వం ఉండకపోవడం, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు స్వచ్ఛందంగా సమీకృతం కావడం మరో ప్రత్యేకతగా గుర్తించింది. 

అయితే అన్ని ఉద్యమాలు ఒకే విధమైన ఫలితాలను సాధించలేదు. కొన్ని ప్రభుత్వాలను మార్చగా.. మరికొన్ని విధానాల ఉపసంహరణతోనే ఆగిపోయాయి. ఇంకొన్ని దేశాల్లో నిరసనకారుల డిమాండ్లను ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందువల్ల సోషల్‌ మీడియా ప్రచారంతో పాటు విస్తృత ప్రజామద్దతు, స్పష్టమైన డిమాండ్లు, ప్రజాస్వామ్యసంస్థల సహకారం కూడా కీలకమని అధ్యయనాలు సూచిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement