చిచ్చు రగిల్చిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో దారుణంగా రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు
సొంతంగా ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, మా పార్టీని ఉద్ధరించారా
గోదావరి జిల్లాలు దాటితే పావలాకి పనికిరాడు.. త్యాగాలు చేశాడా
రెండుచోట్ల ఓడిపోయావ్.. మా ఓట్లతోనే పిఠాపురంలో గెలిచావ్
కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే.. నిజస్వరూపం చూపించింది
టీడీపీ శ్రేణుల వ్యాఖ్యలపై జనసైనికుల అంతర్మథనం
ఊడిగం చేస్తున్నా దారుణంగా అవమానిస్తారా?
ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు.. ఇదే కరెక్ట్ టైం బైటకు రావడానికి..
ప్రతిసారీ మనమే ఎందుకు తగ్గాలి? ఈసారి పోటీ చేసి చూపిద్దాం
సోషల్ మీడియాలో కొనసాగుతున్న పోస్టుల యుద్ధం
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట వెన్నుపోటు పార్టీ కూటమిలో పెద్ద చిచ్చు రగిలింది. ఆదివారం పోలవరం జిల్లా కాకవాడలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో దాడి చేయగా.. ‘కూటమి ప్రభుత్వం మీ అయ్య జాగీరా’ అంటూ జనసేన నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు ఊడిగం చేస్తున్నా ఇంతలా మాటలంటారా అంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మాభిమానం దెబ్బతినేలా మాటలంటున్నా ఇంకా కొనసాగాలా.. ఇదే కరెక్ట్ టైమ్ మనం బైటకు రావడానికి అని జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.
ప్రతి సారీ మనం ఎందుకు తగ్గాలి? రాజకీయంగా మనం కూడా ఎదగాలి కదా.. కాదూ కూడదంటే పొత్తుకు నమస్కారం పెట్టి ప్రతి చోటా అభ్యర్థులు ఉన్నారు.. పోటీ చేసి చూపిస్తారు.. అని రవితేజ పవనిజం పేరుతో ఓ జనసైనికుడు పోస్టు పెట్టాడు. ‘చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఆయనకు మద్దతుగా ఎవరూ రోడ్డుపైకి రాకపోతే, అప్పుడు జన సైనికులు, వీర మహిళలు రోడ్లపైకి వచ్చారు’ అంటూ పవన్ కాకవాడ సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో రెచ్చిపోయాయి. వాటిని జనసైనికులు తీవ్రస్థాయిలో కౌంటర్ చేస్తున్నారు.



టీడీపీని ఉద్ధరించినట్టు మాట్లాడితే ఊరుకోం..
‘‘వాళ్ల పార్టీకి సీట్లు కేటాయిస్తే అభ్యర్ధిని కూడా మనమే (టీడీపీ) సప్లయ్ చేయాల్సి వచ్చింది. వాళ్ల కార్యకర్తలకు తిండి పెట్టడానికి డబ్బులు లేవు.. మనల్నే అడుక్కున్నారు. వీళ్లు వచ్చేశారంట టీడీపీని కాపాడడానికి..’’ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ‘‘కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెడితే, అది కుక్క బుద్ధి మాత్రమే చూపిస్తుంది. కుక్క నిజ స్వరూపం ఈ రోజు చూపించింది’’ అంటూ పరోక్షంగా పవన్‌పై ఓ కార్యకర్త చంద్రబాబు వీడియోను జత చేసి పోస్టు చేశారు.
‘‘పొత్తు పేరుతో మీరు నెత్తిన పెట్టుకుంటే పెట్టుకోండి కానీ తెలుగుదేశం కార్యకర్తల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఆ సన్నాసులు టీడీపీని ఉద్దరించినట్లు మాట్లాడితే ఊరుకునే చేతకాని దద్దమ్మలం కాదు మేం.. ఆ కులసేన అధినేతను కాస్త నోరు దగ్గరపెట్టుకుని మాట్లాడమని చెప్పండి..’’ అని మరో టీడీపీ కార్యకర్త ఘాటు పోస్టు పెట్టాడు. ‘‘ సొంతంగా రెండు చోట్ల ఎమ్మెల్యేగా గెలవలేక, సొంత కార్యకర్తల వల్లే రెండు చోట్ల ఓడిపోయా అని పిల్ల సైనిక్‌లను తిట్టిపోసిన ఆయన మాటకు విలువ ఉందా’’.. ఇదీ మరో కార్యకర్త ప్రశ్న.

‘‘మీ నాయకులు మీ సైనికులు మీ వీర మహిళలు మీ వెనకే నిలబడలేదు. మా లీడర్ కోసం రోడ్డు ఎక్కారా పవన్ కళ్యాణ్‌గారూ’’ అని మరో కార్యకర్త నిలదీశాడు. ‘‘ఒక్క కేబినెట్ మీటింగ్‌కి రారు.. వీరు త్యాగాలు చేసేశారా... గోదావరి జిల్లాలు దాటితే పావలాకి పనికిరాడు వీరు త్యాగాలు చేశాడా.. ఒకర్ని అడుక్కునే స్టేజ్‌లో ఉన్న మీరు త్యాగాలు చేశారా..?’’ మరో టీడీపీ కార్యకర్త ప్రశ్న ఇది.

పొత్తుపెట్టుకుని జనసేన గెలిచిందంటే ఊరుకోం
టీడీపీ కార్యకర్తల పోస్టులపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. నేరుగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర నాటక అకాడమీ సభ్యురాలు శివపార్వతి రంగంలోకి దిగారు. ‘ఎక్స్’లో వరుస పోస్టులతో టీడీపీపై విరుచుకుపడ్డారు. ‘కూటమి ప్రభుత్వం నీ అయ్యా జాగీరా? అన్ని పార్టీల భాగస్వామ్యంతో వచ్చిందది. ఎవడురా నన్ను మాట్లాడొద్దు అనేది.. మీ తొక్కలో రూల్స్ మడిచి పెట్టుకోండి’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మా పార్టీ నాయకుడిని కానీ, మా పార్టీ గురించి కానీ ఇష్టం వచ్చినట్లు వాగితే మామూలుగా ఉండదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పవన్‌ను చూసి నవ్విన వాళ్ళే ఆయన సపోర్ట్ కోసం దేబిరించారు తప్ప ఆయన ఎవరినీ నాకు ఇది చేయండి అని అడగలేదన్నారు. ‘2014లో సపోర్ట్ చేస్తే అధికారం రాగానే పవన్ కళ్యాణ్ ఎవరు అని అన్నారు. అలా అన్నవాళ్లే 2019లో 23కే పరిమితమయ్యారు. లక్షల మంది కేడర్ పెట్టుకుని సంపాదించిన సీట్లు 23 జస్ట్ మాకన్నా 2 ఎక్కువ అంతే’ అని పేర్కొన్నారు.

వెంట వెంటనే గెలిచిన చరిత్ర కూడా ఎక్కడా లేదు అని వ్యాఖ్యానించారు. జనసేనకి బలం లేదని, రెండు చోట్ల ఓడిపోయారని, పొత్తు పెట్టుకుని గెలిచారని అంటే ఊరుకొనేది లేదని జనసేన శ్రేణులు టీడీపీని హెచ్చరించాయి. పరోక్షంగా లోకేశ్ పైనా విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టారు. ‘టీడీపీ వాళ్లు చేసే అతికి జనసేన వాళ్ళు ఎవరైనా గట్టిగా స్పందిస్తే కేసులు పెట్టించి, వాళ్ళ మీద కోవర్ట్ ముద్ర వేస్తున్నారు. పైకి కూటమి స్ఫూర్తి, పొత్తు ధర్మం అని కథలు చెప్తారు’ అంటూ పేర్కొన్నారు.


