రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ సత్యనారాయణమూర్తి
ఖరారు చేసిన చంద్రబాబు నేతృత్వంలోని ఎంపిక కమిటీ
ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం
రాజధాని కేసుల్లో అనుకూల తీర్పునిచ్చినందుకే..!.. 6 నెలల్లో రాజధానిని అభివృద్ధి చేసి తీరాలన్న ముగ్గురిలో జస్టిస్ మూర్తి ఒకరు
హైకోర్టు న్యాయమూర్తిగా ఉండగా టీడీపీ అనుకూలురిగా ముద్ర
బాబుకు అనుకూలమనే కంటే జగన్‌కు వ్యతిరేకి అని న్యాయ వర్గాల్లో చర్చ
మచిలీపట్నానికి చెందిన టీడీపీ నేతతో సన్నిహిత సంబంధాలు
పదవీ విరమణ తరువాత కూడా టీడీపీకి న్యాయ వ్యవహారాల్లో సాయం
2024 మార్చి 24 నుంచి హెచ్‌ఆర్‌సీ పోస్టు ఖాళీగానే
ఇతరులకు సర్ది చెప్పి తాజాగా జస్టిస్ మూర్తి వైపు మొగ్గు చూపిన బాబు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని కేసులకు సంబంధించి అనుకూల తీర్పునిచ్చిన అప్పటి న్యాయమూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కీలక పదవి కట్టబెట్టారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆయన ఎంపిక ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర తరువాత జస్టిస్ సత్యనారాయణమూర్తి నియామక ఉత్తర్వులు జారీ అవుతాయి. హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పోస్టు భర్తీ నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎంపిక కమిటీ సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైంది.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్‌ఆర్‌సీ చైర్మన్ ఎంపికపై చర్చించారు. అనంతరం జస్టిస్ సత్యనారాయణమూర్తిని చైర్మన్‌గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సమయంలో తనకు అనుకూలంగా వ్యవహరించిన వారికి వారి పదవీ విరమణ అనంతరం చంద్రబాబు కీలక పదవులు కట్టబెడుతున్నారు. చేసిన సాయం ఎంత పెద్దది అన్న దాన్ని బట్టి అంత మంచి పోస్టు ఇస్తున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేసిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును లోకాయుక్తగా నియమించిన విషయం తెలిసిందే.
బాబుకు అనుకూలం.. జగన్‌కు వ్యతిరేకం...!
జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి 2016 నుంచి 2022 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తిగా ముద్రపడ్డారు. చంద్రబాబుకు అనుకూలంగా అనేకంటే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా తెర వెనుక మంత్రాంగాలు నడిపేవారని హైకోర్టులో అందరూ చెప్పుకునేవారు. మచిలీపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతతో జస్టిస్ మూర్తికి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా చెబుతుంటారు.
జస్టిస్ సత్యనారాయణమూర్తి పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది.బెంచ్‌పై నుంచి తన అభిప్రాయాలను పెద్దగా వ్యక్తం చేయరు. పెద్దగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయరు. కానీ ఆయన ఇచ్చే తీర్పులు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయి. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ ఆ తీర్పుల్లో ఉంటుంది. 2022లో ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా పలు కేసుల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు, చంద్రబాబుకు మార్గదర్శనం చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో దాఖలైన వ్యాజ్యాల్లో పలు వ్యాజ్యాలను ఆయన డ్రాఫ్ట్ చేసి ఇచ్చేవారని హైకోర్టులో టీడీపీ న్యాయవాదులు బహిరంగంగా చెప్పుకునేవారు.
రాజధానిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న జస్టిస్ మూర్తి...
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరుపుతుండగానే, అప్పటి ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని, సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకుంటూ కొత్త చట్టం తెచ్చింది. వాస్తవానికి ఏ చట్టాలను సవాలు చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారో, ఆ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆ వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి.
అయితే త్రిసభ్య ధర్మాసనం మాత్రం ఆ పని చేయలేదు. అన్నీ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. విచారణ సమయంలో ధర్మాసనం.. చట్టాలు చేయకుండా ప్రభుత్వాన్ని నిలువరించలేమని తెలిపింది. రాజధాని ఎక్కడ ఉండాలన్న దాని జోలికి వెళ్లబోమని చెప్పింది. అయితే తుది తీర్పు విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులు ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదంటూ తీర్పునిచ్చింది. రాజధానిగా అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని ధర్మాసనం తన తీర్పులో ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజధానిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలనడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమైంది. నిజానికి ద్విసభ్య లేదా త్రిసభ్య ధర్మాసనాలు తీర్పులు వెలువరించినప్పుడు ఆ తీర్పులు ఏ న్యాయమూర్తి రాశారో ఆ న్యాయమూర్తి పేరును తప్పకుండా రాస్తారు. కాని రాజధాని తీర్పును ముగ్గురు న్యాయమూర్తుల్లో ఎవరు రాశారన్నది అధికారికంగా తెలియదు. అయితే ఆ తీర్పును జస్టిస్ సత్యనారాయణమూర్తే రాశారని అప్పట్లో హైకోర్టులో అందరూ చెప్పుకున్నారు.
ఎవరెంత మేలు చేశారన్నదే ప్రామాణికం.. ఆ మేరకే జస్టిస్ మూర్తికి పోస్టు...
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి 2024 మార్చి 24 నుంచి ఖాళీగా ఉంది. ఈ పోస్టును భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇన్నాళ్లుగా చర్యలు తీసుకోలేదు. తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పోస్టు భర్తీని వాయిదా వేస్తూ వచ్చారు. ఈ పోస్టును తనకు సహాయం చేసిన పలువురు విశ్రాంత న్యాయమూర్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తీవ్రమైన పోటీ ఉండటం, ఆ విశ్రాంత న్యాయమూర్తులందరూ తనకు ఏదో ఒక రకంగా సాయం చేసి ఉండటంతో ఎవరికి పదవి కట్టబెట్టాలో బాబు తేల్చుకోలేకపోయారు. దీంతో సుదీర్ఘ కాలంగా ఆ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ పోస్టుల భర్తీ గురించి ఎప్పుడు ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేస్తూ వచ్చింది. చివరకు రాజధాని కేసుల్లో కావాల్సిన విధంగా తీర్పునిచ్చిన జస్టిస్ సత్యనారాయణమూర్తికే హెచ్‌ఆర్‌సీ పోస్టును కట్టబెట్టాలని చంద్రబాబు కొంత కాలం క్రితం నిర్ణయించారు. అయితే ఇటీవల పదవీ విరమణ చేసిన కొందరు న్యాయమూర్తులు కూడా ఈ పోస్టును ఆశించారు. వారందరికీ సర్ధి చెప్పుకునే క్రమంలో పోస్టు భర్తీ కొంత ఆలస్యమైంది. చివరకు చంద్రబాబు తనకు మేలు చేసిన జస్టిస్ సత్యనారాయణమూర్తికే హెచ్‌ఆర్‌సీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.


