ఒంటరి వృద్ధులకు ఊరట | Senior Living Communities A Platform for Modern Living | Sakshi
Sakshi News home page

ఒంటరి వృద్ధులకు ఊరట

Oct 13 2026 5:05 AM | Updated on Oct 13 2026 5:05 AM

Senior Living Communities A Platform for Modern Living

ఆధునిక జీవనానికి వేదిక ‘సీనియర్‌ లివింగ్‌ కమ్యూనిటీలు’ 

వృద్ధులు పెరుగుతుండటంతో విస్తరిస్తున్న కేర్‌ మార్కెట్‌ 

సీనియర్‌ లివింగ్‌ మార్కెట్‌కు రూ.లక్ష కోట్ల డిమాండ్‌ 

ప్రస్తుతం 22 లక్షల యూనిట్ల అవసరం 

అందుబాటులో ఉన్నవి 25 వేలే 

హైదరాబాద్‌ సహా తిరుపతి, విశాఖ వంటి నగరాలపై వ్యాపారుల ఆసక్తి

సాక్షి, అమరావతి: పిల్లలు విదేశాల్లో స్థిరపడుతుంటే..తల్లిదండ్రులు మాత్రం భారత్‌లోని స్వస్థలాల్లోనే మిగిలిపోతున్నారు. పెద్ద ఇళ్లల్లో ఇద్దరే ఉంటున్న వృద్ధ దంపతులు,అత్యవసర సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లేవారు లేక ఇబ్బంది పడుతున్న వారు, రోజువారీ పనులకు సాయం అవసరమవుతున్న వారు పెరుగుతున్నారు. దీంతో సంప్రదాయ వృద్ధాశ్రమాలకు తోడు ‘సీనియర్‌ లివింగ్‌ కమ్యూనిటీలు’ కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇది ఇప్పుడు సామాజిక మార్పుతో పాటు కొత్త రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌గా మారుతోంది. 2030 నాటికి ఈ మార్కెట్‌ రూ.1 లక్ష కోట్లను దాటే అవకాశం ఉందని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ‘కొలియర్స్‌’ అంచనా.

రూ.13 వేల కోట్ల పెట్టుబడులు 
2025 నుంచి ఇప్పటివరకు సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టుల కోసం డెవలపర్లు, ఆపరేటర్లు, పెట్టుబడిదారులు రూ.13 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే మూడునాలుగేళ్లలో 75 వేల కొత్త యూనిట్లు అందుబాటు­లోకి వచ్చే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో పాటు ఆరోగ్య సేవల సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు.

ప్రధాన నగరాల్లో విస్తరణ 
ప్రస్తుతం టైర్‌–1 నగరాల్లో ఎక్కువగా ఉన్న ఈ రంగం ఇప్పుడు చిన్న నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల వైపు విస్తరిస్తోంది. కొత్త ప్రాజెక్టుల్లో 30–40 శాతం టైర్‌–2, టైర్‌–3 నగరాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో రావచ్చని కొలియర్స్‌ అంచనా వేసింది. తిరుపతి, అయోధ్య, విశాఖ వంటి కేంద్రాలను సీనియర్‌ హౌసింగ్‌కు అనుకూల ప్రాంతాలుగా పేర్కొంది. హైదరాబాద్‌ వంటి నగరాలపై విదేశాల్లోని భారతీయుల ఆసక్తి కూడా పెరుగుతోంది.

వృద్ధాశ్రమం నుంచి అపార్ట్‌మెంట్‌ వరకు.. 
కొత్తగా వస్తోన్న సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్టులు సాధారణ వృద్ధాశ్రమాలకు భిన్నంగా ఉంటున్నాయి. 1, 2, 3 బీహెచ్‌కేలు, విల్లాలు, కమ్యూనిటీ హాళ్లు, భోజనం, హౌస్‌కీపింగ్, ఫిట్‌నెస్, వైద్య సేవలు, అత్యవసర స్పందన, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు అందిస్తున్నారు. స్వతంత్రంగా జీవించగలిగేవారికి ‘ఇండిపెండెంట్‌ లివింగ్‌’, అదనపు వైద్యం లేదా రోజువారీ సహాయం అవసరమైన వారికి ‘అసిస్టెడ్‌ లివింగ్‌’ విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి.

భారత్‌లో 22 లక్షల యూనిట్ల అవసరం
కొలియర్స్‌ 2026 నివేదిక ప్రకారం..దేశంలో ప్రస్తుతం సీనియర్‌ హౌసింగ్‌కు 20–22 లక్షల యూనిట్ల డిమాండ్‌ ఉంది. కానీ ఆర్గనైజ్డ్‌ సీనియర్‌ లివింగ్‌ రంగంలో అందుబాటులో ఉన్నవి 25 వేల యూనిట్లే. అంటే డిమాండ్‌లో కేవలం 1.3% మేరే వ్యవస్థీకృత సీనియర్‌ లివింగ్‌ సౌకర్యాలున్నాయి. 2030 నాటికి సీనియర్‌ హౌసింగ్‌ అవసరం 30 లక్షల యూనిట్లకు చేరుతుందని కొలియర్స్‌ అంచనా. అప్పటికి ఆర్గనైజ్డ్‌ సప్లై లక్ష యూనిట్లకు పెరగొచ్చని చెబుతోంది. 

తల్లిదండ్రుల భద్రత, వైద్యం, సామాజిక జీవనం కోసం సీనియర్‌ లివింగ్‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని కొలియర్స్‌ నివేదిక పేర్కొంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడటం, ఉమ్మడి కుటుంబాల తగ్గుదల, ఆయుర్దాయం పెరగడం, వృద్ధుల సంఖ్య పెరగడం.. ఇవన్నీ కలిసి ‘‘సీనియర్‌ లివింగ్‌ కమ్యూనిటీ’’లకు డిమాండ్‌ పెంచుతున్నాయి. ఒకప్పుడు సేవా సంస్థలుగా ఉన్న వృద్ధాశ్రమాల స్థానంలో ఇప్పుడు వైద్యం, భద్రత, భోజనం, వినోదం, నివాసం అన్నీ కలిపిన కమ్యూనిటీలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement