మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల చర్చలకు పవన్ కళ్యాణ్ డుమ్మా
చర్చలు కొనసాగుతుండగానే రిజర్వేషన్లు ఖరారు చేసిన టీడీపీ
ఏకపక్ష నిర్ణయంపై జనసేన నేతల గుర్రు
నేడు మరోసారి భేటీ
సాక్షి, అమరావతి: మునిసిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. సీట్ల లెక్కలు తేల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సోమవారం సమావేశమైనా ఎలాంటి స్పష్టత రాలేదు. కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ డుమ్మా కొట్టడం గమనార్హం. పొత్తు చర్చలు తాము ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడమే పవన్ గైర్హాజరుకు కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
మేయర్, చైర్మన్ పీఠాలపై పేచీ
మునిసిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కోరుతున్న మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలను కేటాయించేందుకు చంద్రబాబు సుముఖంగా లేకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. జనసేన ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఆ పార్టీ కోరుతున్న స్థానాలకు టీడీపీ ఏకపక్షంగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పొత్తు చర్చలు కొలిక్కి రాకముందే రిజర్వేషన్లు ఎలా ప్రకటిస్తారని జనసేన నేతలు నిలదీస్తున్నట్లు సమాచారం. మిత్రపక్షమంటూనే తమను లెక్కలోకి తీసుకోకుండా టీడీపీ పెత్తనం చెలాయిస్తోందన్న అసంతృప్తి జనసేన శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.
భేటీ తర్వాత ఎవరి దారి వారిదే
సమావేశం ముగిసిన తర్వాత కూటమి పార్టీ నేతలు ఎవరి దారి వారు పట్టడం చర్చనీయాంశమైంది. జనసేన, బీజేపీ నేతలు నేరుగా బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా విందు సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో విడిగా సమావేశమై మంతనాలు జరిపారు. సమావేశంలో ఏం జరిగిందన్న దానిపై మూడు పార్టీల నేతలు నోరు మెదపకపోవడం గమనార్హం. దీంతో పొత్తు చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.
నెల్లూరు మేయర్ మాదేనంటూ హడావుడి
చర్చలు ఇంకా తేలకముందే నెల్లూరు మేయర్ పీఠం బీజేపీకి ఖరారైందంటూ బీజేపీ నేతలు హడావుడి చేయడం గమనార్హం. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా మౌనం వహించింది. టీడీపీ నుంచి కూడా ఎలాంటి స్పందనా రాలేదు. సీట్ల పంపకమే తేలకుండా ఒక్కో పార్టీ ఒక్కో ప్రకటన చేయడం కూటమిలో సమన్వయ లోపానికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
నేడు మళ్లీ భేటీ
ప్రతిష్టంభన నేపథ్యంలో మంగళవారం మరోసారి సమావేశం కావాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి పవన్‌కళ్యాణ్ హాజరవుతారని చెబుతున్నారు. అయితే మేయర్, చైర్మన్ పీఠాలపై టీడీపీ పట్టు వీడకుంటే ఈ భేటీ కూడా ఫలితం లేకుండానే ముగిసే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.


