కొత్త ఎఫ్‌టీఏలతో ఎగుమతులకు ఊపు | Sakshi
Sakshi News home page

కొత్త ఎఫ్‌టీఏలతో ఎగుమతులకు ఊపు

Published Fri, Nov 24 2023 8:36 AM

New Ftas, Lower Cost Of Power And Logistics To Help Boost - Sakshi

న్యూఢిల్లీ: దేశాలతో కొత్త సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), వ్యయం తగ్గింపునకు చర్యలు, తక్కువ ధరకు విద్యుత్‌ అందుబాటు, లాజిస్టిక్స్‌ పురోగతి, భూ సంస్కరణలు వంటి చర్యలు 2030 నాటికి భారతదేశం వస్తువులు– సేవల ఎగుమతులను 2 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడానికి దోహదడతాయని పరిశ్రమ చాంబర్‌– పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) నివేదిక గురువారం తెలిపింది.

‘ఇండియాస్‌ ఎమర్జింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ డైనమిక్స్‌: విజన్‌ 2030 నాటికి 2 ట్రిలియన్‌ డాలర్ల ఎగుమతులు’’ అన్న శీర్షికతో ఆవిష్కృతమైన ఈ  నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. 

►సముద్ర ఉత్పత్తులు, ఇనుప ఖనిజం, కొన్ని రసాయనాలు, ఫార్మా, పత్తి, అల్యూమినియం, ట్యాంకర్లతోసహా తొమ్మిది రంగాల్లోని 75 కీలక ఉత్పత్తుల ఎగుమతులకు స్కీమ్‌లు అవసరం. ఈ ఉత్పత్తులు వార్షికంగా చూస్తే మొత్తం ఎగుమతుల విలువలో  222 బిలియన్ల వాటా కలిగిఉన్నాయి.   

►భారత్‌ మొత్తం ఎగుమతుల్లో ఈ విలువ 50 శాతం. ప్రపంచ స్థాయి వాణిజ్యంలో చూస్తే... ఈ 75 ఉత్పత్తులు ఎంతో కీలకంగా ఉన్నాయి. అయితే ఈ ఉత్పత్తులలో భారతదేశం వాటా మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో 6 శాతం మాత్రమే. 

►ఈ 75 ఉత్పత్తుల విషయంలో భారత్‌ తన అవకాశాలను పెంపొందించుకోడానికి అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, కొనుగోలుదారు–విక్రేత సమావేశాలలో పాల్గొనడం, ఈ వస్తువుల కోసం ఎగుమతి ప్రోత్సాహక పథకాలను పొడిగించడం వంటి చర్యలు అవసరం.  

►భారతదేశం సేవా రంగం ఎగుమతులు సాంప్రదాయకంగా ఉత్తర అమెరికా, ఐరోపాలో కేంద్రీకృతమై ఉన్నాయి, అయితే ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వంటి ఖండాల్లో పురోగమిస్తున్న దేశాలుసైతం భారత్‌ ఎగుమతుల వృద్దికి అవకాశాలను పుష్కలంగా అందిస్తాయి.టోగో, నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇజ్రాయెల్, ఇండోనేషియా, టర్కీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు భారత్‌ ఎగుమతుల వృద్ధికి దోహదపడే గమ్యస్థానాల్లో కొన్ని .  

►కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సమగ్రంగా ఉండాలి. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.భారత్‌ ఎగుమతుల రంగానికి ఈ విభాగం కీలకమైనది కావడమే దీనికి కారణం.  

►రెపో రేటును తగ్గించడం (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో ప్రస్తుతం 6.5 శాతం) వల్ల బ్యాంకింగ్‌ రుణ రేట్లు తగ్గుతాయి. ఇది వ్యాపారాలకు మూలధన వ్యయాలను తగ్గిస్తుంది. దేశీయంగా డిమాండ్‌ పెరగడానికీ ఈ చర్య దారితీస్తుంది. దేశీయ మార్కెట్‌లో ఉత్పత్తిదారులు– అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతిదారుల పోటీతత్వాన్ని పెంచుతుంది. 

►ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కొన్నేళ్లుగా విద్యుత్తు ఖర్చులు గణనీయంగా తగ్గాయి. అయినప్పటికీ, యూనిట్‌ విద్యుత్‌ ఛార్జీలు ఇప్పటికీ గణనీయంగా ఎక్కువగానే ఉన్నాయి.     

►ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో భూమి ఒకటి. ప్రభుత్వం భూసంస్కరణలపై దృష్టి సారించాలి. ఇది భూమిని కొనుగోలు చేయడంలో సంక్లిష్టతలను తగ్గిస్తుంది. అలాగే వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. 

►సామర్థ్యం, ఉత్పాదకతను పెంచే మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇది అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లో కంపెనీల పోటీతత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడే అంశం.  

►ఎగుమతులకు సంబంధించి మౌలిక వనరుల పురోగతి మరింత మెరుగుపడాలి. దేశంలో లాజిస్టిక్‌ వ్యయాలను తగ్గించడానికి రైలు, ఓడరేవులను మరింత అభివృద్ధి చేయాలి.  

భారతదేశంలోకి పేపర్‌ దిగుమతులు పరిమాణం పరంగా 2023–24 ప్రథమార్థంలో  (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) 43 శాతం పెరిగాయి. ఆసియన్‌ దేశాల నుండి దిగుమతులు రెండు రెట్లు పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (డీజీసీఐఎస్‌) డేటా ప్రకారం, కాగితం– పేపర్‌బోర్డ్‌ దిగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 672,000 టన్నులు. 2023–24 ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో ఈ పరిమాణం 959,000 టన్నులకు పెరిగింది. ఇదే కాలంలో ఆసియన్‌ దేశాల నుంచి దిగుమతుల పరిమానం 81,000 టన్నుల నుంచి 2,88,000 టన్నులకు ఎగసింది.  విలువ పరంగా చూస్తే, పేపర్‌ దిగుమతుల బిల్లు సమీక్షా కాలంలో రూ.5,897 కోట్ల నుంచి రూ.6,481 కోట్లకు ఎగసింది. ఆసియన్‌ దేశాలకు సంబంధించి విలువ రూ.715 కోట్ల నుంచి రెట్టింపై రూ.1,509 కోట్లకు చేరింది. పేపర్‌ దిగుమతుల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. కాగా,  ముడిసరుకు, ఇన్‌పుట్‌ వ్యయాల్లో గణనీయమైన పెరుగుదల దృష్ట్యా  కాగితం– పేపర్‌బోర్డ్‌ను ఉత్పత్తి చేసే పరిశ్రమలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఇండియన్‌ పేపర్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐపీఎంఏ)అధ్యక్షుడు పవన్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దిగుమతుల వల్ల మరింత పోటీ పూర్వక పరిస్థితిని దేశీయ పరిశ్రమ ఎదుర్కొంటోందని అన్నారు.  

కొనసాగుతున్న అనిశ్చితి... 
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా  ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్‌ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్‌లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది.  భారత్‌ వస్తు ఎగుమతులు అక్టోబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్‌ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా  2022 డిసెంబర్‌ నుంచి 2023 సెప్టెంబర్‌ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్‌లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్‌ డాలర్లకు చేరింది.  దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో చరిత్రాత్మక రికార్డు స్థాయిలో 31.46 బిలియన్‌ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం. ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య భారత్‌ వస్తు ఎగుమతుల విలువ 7 శాతం క్షీణించి 244.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95 శాతం క్షీణించి 391.96 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు–  ఈ ఏడు నెలల్లో 147.07 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  భారత్‌ వస్తు వాణిజ్య పరిమాణం 2021–22 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ కాలంలో వస్తు ఎగుమతుల విలువ 422 బిలియన్‌ డాలర్లయితే, దిగుమతుల విలువ 613 బిలియన్‌ డాలర్లు. 

ఇక 2022–23 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి భారత్‌ వస్తు ఎగుమతులు 450 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు 714 బిలియన్‌ డాలర్లు. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో 2023–24లో భారత్‌ వార్షిక  వాణిజాభివృద్ధి అంచనాలపై సందేహాలు నెలకొన్నాయి.  మరోవైపు సేవల రంగం ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ వరకూ  ఏడు నెలల కాలంలో ఈ విలువ 181.37 బిలియన్‌ డాలర్ల నుంచి 192.65 బిలియన్‌ డాలర్లకు ఎగసింది.

 పురోగతి సాధ్యమే.. 
ఎగుమతుల పురోగతికి ప్రభుత్వం చక్కటి విధాన నిర్ణయాలను తీసుకుంటోంది. మరోవైపు ఎగుమతిదారులు కూడా తమ ఎగుమతులకు మంచి ధరను రాబట్టుకునే మార్గాలతో అనుసంధానమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎగుమతుల రంగం క్రమంగా పురోగమిస్తోంది. – సంజీవ్‌ అగర్వాల్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌  

Advertisement
 
Advertisement