ఇన్ఫీ నారాయణ మూర్తి వివరణ
ముంబై: దేశం పురోగమించాలంటే యువత సుదీర్ఘ సమయం పాటు పని చేయాలన్న వ్యాఖ్యలపై దుమారం ఇంకా చల్లారని నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి వివరణనిచ్చారు. ఎవరూ ఎవరినీ గంటల తరబడి పని చేయాలని చెప్పరని, ఎవరికి వారే ఆలోచించుకుని, తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘నేను పొద్దున్నే ఆరున్నరకి ఆఫీసుకి చేరుకునేవాణ్ని.
రాత్రి ఎనిమిదిన్నరకి బైటికి వచ్చేవాణ్ని. ఇలా నేను దాదాపు నలభై ఏళ్లు పని చేసాను. ఇది వాస్తవం. నేను స్వయంగా చేశాను. ఇది తప్పు.. నువ్వు ఇలా చేయాలి.. ఇలా చేయకూడదు.. అని ఎవరూ అనడానికి లేదు. ఇలాంటి వాటిపై చర్చలు, వాదోపవాదాలు అనవసరం. మీకు మీరుగా ఆలోచించుకుని, మీరు కోరుకున్నది చేయడమే‘ అని కిలాచంద్ స్మారకోపన్యాస కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి తెలిపారు. నిరుపేద బాలలకు మెరుగైన భవిష్యత్తును అందించే దిశగా కష్టపడి పనిచేయాలా, వద్దా అనేది ఎవరికి వారు ఆలోచించుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయమని పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
