ముంబైలోని జుహు తారా రోడ్డులో.. సముద్రానికి ఎదురుగా ఉన్న లీలా బంగ్లా రూ. 221 కోట్లకు అమ్ముడైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బంగ్లా ఆర్ట్ డెకో నిర్మాణం, గ్రేడ్ IIB వారసత్వ హోదాను కలిగి ఉంది. దీనిని అమ్మకానికి పెట్టిన తరువాత చాలామంది డెవలపర్లు, వ్యాపారవేత్తలను ఆకట్టుకుంది.
నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సంబంధం ఉన్న కుటుంబానికి చెందిన గౌతమ్ నానావతికి చెందిన లీలా బంగ్లాను నోటండాస్ జ్యువెలర్స్ గ్రూప్‌లో భాగమైన నోటండాస్ రియల్టీ రూ.221 కోట్లకు కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత బుధవారం ఈ లావాదేవీ అధికారికంగా ఖరారైందని సమాచారం.
నోటండాస్ రియల్టీ సంస్థకు చెందిన మహేష్ జగ్వాని, హర్ష్ జగ్వాని అనే తండ్రి-కొడుకు ఈ డీల్‌ను పూర్తి చేశారు. వీరు నోటండాస్ జ్యువెలర్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీనిని 1983లో కిషిన్ జగ్వానీ స్థాపించారు. ఇది బాంద్రాలోని వాటర్‌ఫీల్డ్ రోడ్ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
చదరపు అడుగుకు రూ. 2,60,592
1,355 చదరపు మీటర్ల స్థలంలో ఉన్న లీలా బంగ్లా నిర్మాణ విస్తీర్ణం సుమారు 8,480 చదరపు అడుగులు. అదనంగా 2,500 చదరపు అడుగుల టెర్రస్.. 5,000 చదరపు అడుగుల తోట కూడా ఉన్నాయి. చదరపు అడుగుకు రూ. 2,60,592 ధర చెల్లించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ బంగ్లాలో 1950ల కాలానికి చెందిన బర్మా టేకు చెక్కతో తయారైన తలుపుల ఫ్రేములు, మెట్ల నిర్మాణం, అలంకరణలు ఉన్నాయి. ఈ భవనం ఆర్ట్ డెకో శైలిని ప్రతిబింబిస్తూ పురాతన సౌందర్యాన్ని కాపాడుకుంటోంది. సముద్రం వైపు ఉండే ఇలాంటి పెద్ద స్థలాలు జూహు ప్రాంతంలో చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఈ ఆస్తికి వ్యాపారవేత్తలు, డెవలపర్లు ఎంతో ఆసక్తి చూపారు.
కేవలం మరమ్మతులు మాత్రమే..
అయితే.. గ్రేడ్ IIB హెరిటేజ్ హోదా ఉండటం వల్ల ఈ భవనాన్ని పూర్తిగా కూల్చి కొత్తగా నిర్మించలేరు. కేవలం మరమ్మతులు, విస్తరణలు మాత్రమే చేయవచ్చు. అవి కూడా అసలు నిర్మాణ శైలిని కాపాడే విధంగా ఉండాలి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ఈ ఆస్తి ప్రాముఖ్యత తగ్గలేదు.
ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఈ లావాదేవీని నిర్వహించిందని నివేదిక పేర్కొంది, అయితే ఈ విషయంపై సంప్రదించినప్పుడు ఆ సంస్థ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఈ బంగ్లాను మొదట 2022లో రూ. 210-220 కోట్ల అంచనా ధరతో మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ధరను రూ. 250 కోట్లకు పెంచారు. చివరికి రూ.221 కోట్లకు అమ్ముడైంది.
ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!


