ఎంఎస్‌ఎంఈలు నాణ్యత ప్రమాణాలను అనుసరించాలి | MSMEs must comply with quality standards Consumer Affairs Secretary | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ఎంఈలు నాణ్యత ప్రమాణాలను అనుసరించాలి

May 31 2025 8:09 AM | Updated on May 31 2025 8:18 AM

MSMEs must comply with quality standards Consumer Affairs Secretary

న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) ఉత్పత్తుల తయారీలో స్వచ్ఛంద, తప్పనిసరి ప్రమాణాలను పాటించాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్టు చెబుతూ.. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్‌ఎంఈల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు.

ఎంఎస్‌ఎంఈలు తమ సమస్యల గురించి తెలియజేయడం, సత్వర పరిష్కారాలను పొందే విషయంలో మరింత చురుగ్గా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రమాణాల కోసం పరిశ్రమ డిమాండ్‌ చేయాలని.. వాటిని రూపొందించడంలో పాలు పంచుకోవాలని కోరారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వేగంగా ప్రమాణాలను రూపొందించగలదంటూ.. ప్రమాణాల విషయంలో పరిశ్రమ పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.

నాణ్యమైన ఉత్పత్తుల దిశగా గత కొన్నేళ్లలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న టెస్టింగ్‌ ల్యాబ్‌లను బలోపేతం చేయడంతోపాటు, కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు రూ.78 కోట్ల నిధులకు ఇటీవలే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఏ దేశం అయినా అంతిమంగా తన ఉత్పత్తులు, సేవల్లో విశ్వసనీయతతోనే వృద్ధి చెందగలదని గుర్తు చేశారు. దిగుమతయ్యే నాసిరకం ఉత్పత్తులను తిరస్కరించే ప్రమాణాలను భారత్‌ కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉగాండా, రువాండాలకు సైతం నాణ్యత నియంత్రణలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 23,000 వరకు భారతీయ ప్రమాణాలు ఉండగా, అవన్నీ స్వచ్ఛందమేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement