
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
రూ. 1,700 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: బంగారు ఆభరణ వర్తక దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఎం.కిరణ్ కుమార్ జైన్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది.
అర్హతగల సంస్థ ఉద్యోగులకు డిస్కౌంట్‌లో షేర్లను ఆఫర్ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,015 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది. 1985లో చెన్నైలోని టీనగర్‌లో తొలి స్టోర్‌ను ప్రారంభించిన కంపెనీ 2024 డిసెంబర్‌కల్లా 56 స్టోర్లకు విస్తరించింది. తద్వారా గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అధిక స్టోర్లు కలిగిన కంపెనీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోనూ కార్యకలాపాలున్నాయి. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల్లో రూ.12,595 కోట్ల ఆదాయం, రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది.