పారిశుద్ధ్య కార్మికులకు ‘లలితా’ కిరణ్‌ సన్మానం | Lalitha Jewellery praised the honesty of the sanitation workers | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులకు ‘లలితా’ కిరణ్‌ సన్మానం

Jan 16 2026 9:59 AM | Updated on Jan 16 2026 10:55 AM

Lalitha Jewellery praised the honesty of the sanitation workers

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో  నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఒక ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా నిలిచింది. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులకు నడిరోడ్డుపై ఒక బ్యాగు కనిపించింది. దానిలో సుమారు 200 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. ఆ కార్మికులు మరో ఆలోచన చేయకుండా, ఆ బ్యాగును పోలీసులకు అప్పగించి, తమ నిజాయితీని చాటుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ లలితా జ్యుయలరీ అధినేత కిరణ్ కుమార్  ఆ కార్మికుల నిజాయితీకి ఫిదా అయ్యారు. ఆయన సోషల్ మీడియాలో వారిని మెచ్చుకోవడమే కాకుండా, వారిని స్వయంగా తన నివాసానికి ఆహ్వానించారు. దీంతో మేరీ, పచ్చైయమ్మాల్, శంకర్ అనే ఈ ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఆయన ఇంటికి వెళ్లారు. కిరణ్ కుమార్ వారికి స్వాగతం పలికారు.
 

ఈ సందర్భంగా ఆయన వారికి తన కుటుంబ సభ్యులతో పాటు విందు భోజనం ఏర్పాటు చేశారు. వారు సమాజానికి అందించిన స్ఫూర్తిని కొనియాడుతూ, వారికి నూతన వస్త్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కష్టపడి పనిచేసే గుణం, పరాయి సొత్తుకు ఆశపడని నిజాయితీ ఈ కార్మికుల్లో ఉండటం అభినందనీయమని, ఇలాంటి వ్యక్తులే సమాజానికి నిజమైన ఆదర్శమని ఆయన ప్రశంసించారు.

 

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేదరికంలో ఉండి కూడా విలువైన బంగారాన్ని తిరిగి ఇచ్చేసిన కార్మికుల గొప్ప మనసును.. అలాగే వారిని గుర్తించి ఇంటికి పిలిచి గౌరవించిన కిరణ్ కుమార్ ఉదారతను నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఇది కూడా చదవండి: 2026 ‘బిగ్ ఫైట్’: అటు బెంగాల్ పులి.. ఇటు తమిళ ‘దళపతి’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement