12% తగ్గించుకునే చాన్స్
ఐపీవోలో టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ సైతం షేర్ల ఆఫర్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తలపెట్టిన భారీ పబ్లిక్ ఇష్యూ ద్వారా, కంపెనీలో భాగస్వాములైన కొన్ని సంస్థలు తమ వాటాలను పూర్తిగా విక్రయించి తప్పుకోనుండగా, ప్రధాన వాటాదారు అయిన అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తన వాటాలను 12 శాతం మేర తగ్గించుకోనుంది. దీనికి సరిసమానమైన 4.59 కోట్ల షేర్లను ఐపీవోలో విక్రయించనుంది. ప్రస్తుతం డబ్ల్యూఎం డిజిటల్ కామర్స్ హోల్డింగ్స్ ద్వారా ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కి 71.77 శాతం వాటాలు ఉన్నాయి.
ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ 10.39 లక్షల షేర్లను, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఫైనాన్స్ 36.78 లక్షల షేర్లను విక్రయించి తప్పుకోనున్నాయి. 15 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 5.08 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ఫోన్‌పే దాదాపు 1.5 బిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మధ్య నాటికి లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. 1.7 బిలియన్ డాలర్ల టాటా క్యాపిటల్ ఇష్యూ తర్వాత ఇది అతి పెద్ద ఐపీవోగా నిలవనుంది.
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలు అందించే ఫోన్‌పేకి 65.76 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు, యూపీఐ లావాదేవీల్లో 45 శాతం మార్కెట్ వాటా ఉంది. 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన 6 నెలల వ్యవధి లో రూ. 3,919 కోట్ల ఆదాయంపై రూ. 1,444 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఇండియా నుంచి విడదీసిన ఫోన్‌పే 2016 నుంచి ఇప్పటివరకు రూ. 18,000 కోట్లు సమీకరించింది.


