5–15 శాతం మధ్య పెరుగుదల
కంపెనీలపై అదనపు వ్యయ భారం
అమల్లోకి కొత్త ఇంధన ప్రమాణాలు
దీంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు
వేసవి ఎండలు అప్పుడే తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్ కండీషనర్ (ఏసీ) కొనుగోలు చేద్దామనుకుంటున్న వారు.. కాస్తంత అదనంగా సమకూర్చుకోక తప్పదు. ఎందుకంటే సరిగ్గా సీజన్ ఆరంభానికి ముందు ఎసీ తయారీ సంస్థలు 5–15 శాతం మధ్య ధరల పెంపును అమలు చేస్తున్నాయి. ముడి సరుకుల ధరలు ప్రియంగా మారడం, సరఫరా చైన్ వ్యయాలు తగ్గించుకునేందుకు ధరల పెంపు బాటలో పయనిస్తున్నాయి. డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ఎల్‌జీ, హైయర్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ పలు మోడళ్ల ఏసీల ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి.
ఏసీల తయారీలోకి వినియోగించే రాగి తదితర ముడి సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు, అధిక రవాణా చార్జీలను కారణాలుగా కంపెనీలు పేర్కొంటున్నాయి. ధరలు పెంచినప్పటికీ.. అధిక ఉష్ణోగ్రతల అంచనాలతో ఈ ఏడాది అమ్మకాలు బలంగానే నమోదవుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. గతేడాది సెపె్టంబర్‌లో జీఎస్‌టీ రేట్ల సవరణ ఫలితంగా ఏసీల ధరలు దిగిరాగా.. తాజా పెంపుతో ఆ ప్రయోజనం పూర్తిగా ఆవిరికానుంది. అప్పుడు రూమ్ ఏసీలపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడం గమనార్హం.
డైకిన్ 12 శాతం పెంపు..
జపనీస్ సంస్థ డైకిన్ ఏప్రిల్ నుంచి తన ఏసీ ధరలను 12 శాతం పెంచనున్నట్టు ప్రకటించింది. మోడళ్లను బట్టి ధరల పెంపు మారుతుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్‌జిత్ జావా తెలిపారు. ‘‘కొత్త ఇంధన నిబంధనలతో ఉత్పత్తుల సామర్థ్యం పెరగనుంది. కాపర్ వంటి ముడి సరుకుల ధరలు పెరిగాయి. రూపాయితో డాలర్ ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నాయి. రవాణా చార్జీలు కూడా పెరిగాయి. దీంతో దిగుమతులు (విడిభాగాలు) వ్యయంగా మారాయి. కనుక కంపెనీలకు ధరలు పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు’’అని జావా వివరించారు. ఈ సీజన్‌లో అమ్మకాలు 2024 స్థాయిలో ఉంటాయంటూ.. కనీసం 15 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తాము ఫిబ్రవరి మధ్య నుంచే 8–10 శాతం మేర ధరలను పెంచినట్టు బ్లాస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు.
‘‘ధరల పెంపునకు ముందుగానే డీలర్లు అదనపు నిల్వలను సమకూర్చుకున్నారు. పెరిగిన ధరలతో కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. గతేడాది జీఎస్‌టీ రేటు తగ్గింపు.. ఇప్పుడు ధరల పెరుగుదల ప్రభావాన్ని భర్తీ చేయనుందన్నారు. డిసెంబర్ నుంచి కాకుండా, గతేడాది వేసవి సీజన్‌తో పోలి్చతే ధరల పెరుగుదల పెద్దగా ఉండదని త్యాగరాజన్ పేర్కొన్నారు. గతేడాది వేసవిలో అసాధారణ వర్షాలు, ముందుగానే నైరుతి సీజన్ రావడం ఏసీ అమ్మకాలను ప్రభావితం చేయడం గమనార్హం.
పోటీ తీవ్రతరం
ఈ ఏడాది రూమ్ ఏసీల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనా. గతేడాది సీజన్ ఆశించిన మేర లేకపోవడంతో ఈ ఏడాది అధిక విక్రయాల ద్వారా మార్కెట్ వాటా పెంచుకునేందుకు కంపెనీలు పోటీపడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ సైతం తన ఏసీల ధరలను 5–15 శాతం మధ్య పెంచనున్నట్టు ప్రకటించింది. తయారీ వ్యయాలు పెరగడం, రూపాయి విలువ క్షీణత, మెరుగైన ఇంధన సామర్థ్యాలతో కూడిన నాణ్యమైన ఏసీలను వినియోగదారులకు అందించాలంటే ధరలను పెంచక తప్పదని వోల్టాస్ ఎండీ ముకుందన్ మీనన్ తెలిపారు. ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ 3 స్టార్ ఏసీల ధరలను 7 శాతం మేర, 5 స్టార్ ఏసీలను 9–10 శాతం మేర పెంచినట్టు ప్రకటించింది.
కొత్త ఇంధన సామర్థ్యాలతో కూడిన ఏసీలతో వినియోగదారులకు 11 శాతం మేర ఇంధనం అదా అవుతుందని.. దీనివల్ల విద్యుత్ బిల్లు రూపంలో గణనీయంగా ఆదా అవుతుందని ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ డైరెక్టర్ సంజయ్ చిట్కర తెలిపారు. హైయర్ ఇండియా తన ఏసీ ధరలను 5–8 శాతం వరకు పెంచగా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 5 శాతం పెంచినట్టు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ కొత్త స్టార్ రేటింగ్ ప్రమాణాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం 5 స్టార్ ఏసీలు 10 శాతం మేర మరింత ఇంధనాన్ని ఆదా చేయనున్నాయి.
ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!?


