
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇందుకు తగ్గట్టుగానే క్రికెటర్ల బ్రాండింగ్ మార్కెట్ అధికంగా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని వారి వ్యక్తిగత సంపాదన కూడా పెరుగుతోంది. దానికితోడు కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల బ్రాండ్ ప్రమోషన్ల కోసం భారీ మొత్తంలోనే ముట్టజెప్పుతున్నారు. దాంతో చాలామంది క్రికెటర్లు దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే చందంతో వయసురీత్యా ఎక్కువ రోజులు క్రికెట్‌లో కొనసాగకపోవచ్చనే భావన, భవిష్యత్తుపై భరోసాను దృష్టిలో ఉంచుకొని స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టీమ్ లక్నో సుపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలతోపాటు తాను ఎండార్స్ చేస్తున్న బ్రాండ్‌ల సంగతుల గురించి తెలుసుకుందాం.
భారత మోస్ట్ స్టైలిష్, నిలకడైన క్రికెటర్లలో ఒకరైన కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా ఆకట్టుకునే ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. 2025 నాటికి ఆయన సందప నికర విలువ రూ.100 కోట్లు (సుమారు 12 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ వేతనాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యక్తిగత పెట్టుబడులు సహా పలు వనరుల నుంచి ఆయనకు సంపద సమకూరుతుంది.
రాహుల్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో గ్రేడ్-ఏ ఒప్పందంలో భాగంగా సంవత్సరానికి రూ.5 కోట్లు వరకు సంపాదిస్తున్నాడు.
గతంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రాహుల్ ప్రతి సీజన్‌కు సరాసరి రూ.16 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ తరఫున ఆడుతున్నారు.
పూమా, రెడ్ బుల్, భారత్ పే, బోట్, టాటా నెక్సాన్, బియర్డో, క్యూర్.ఫిట్, నుమి.. వంటి ప్రధాన బ్రాండ్‌లను రాహుల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఇది అతని ఆదాయానికి గణనీయంగా దోహదం చేస్తుంది.
మెర్సిడెస్ బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ మోడళ్లతో సహా హై-ఎండ్ కార్ల సేకరణతో పాటు బెంగళూరులో ఆయనకు లగ్జరీ ప్రాపర్టీలు ఉన్నాయి.
ముంబైలోని కార్టర్ రోడ్‌లో సుమారు రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. రాహుల్-అతియా శెట్టి దంపతులకు బెంగళూరులో విలాసవంతమైన నివాసం కూడా ఉంది.
ఇదీ చదవండి: డీజిల్‌కు తగ్గిన డిమాండ్.. ఎందుకంటే..
మెటామాన్ అనే పెర్ఫ్యూమ్స్, జువెలరీ బ్రాండ్‌కు రాహుల్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు. అందులో తాను పెట్టుబడి కూడా పెట్టారు.
అర్బన్ ఫ్యాషన్ బ్రాండ్ గల్లీ లైవ్ ఫాస్ట్‌కు రాహుల్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
బోల్డ్ ఫిట్ అనే అథ్లెట్ దుస్తుల తయారీ కంపెనీలో రాహుల్ ఇన్వెస్ట్ చేశారు.
రాహుల్ నిలకడైన గేమింగ్ ప్రదర్శన, నాయకత్వ బాధ్యతలు, బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల తన నికర విలువ క్రమంగా అధికమవుతోంది. భారత్‌లో క్రికెట్‌కు కమర్షియల్ అప్పీల్ పెరగడంతో రాబోయే కాలంలో తన సంపాదన మరింత పెరుగుతుందని తెలుస్తుంది.