
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్‌ల విభాగంలోకి ప్రవేశించడంపై కైనెటిక్ గ్రీన్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గోల్ఫ్, లైఫ్‌స్టయిల్స్ కార్టుల తయారీ కోసం ఇటలీకి చెందిన టొనినో లాంబోర్గినితో చేతులు కలిపింది. వచ్చే దశాబ్దకాలంలో 1 బిలియన్ డాలర్ల పైగా టర్నోవరును లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందుకోసం ఏర్పాటు చేసే కైనెటిక్ గ్రీన్ టొనినో లాంబోర్గిని (కేజీటీఎల్) జాయింట్ వెంచర్ సంస్థలో కైనెటిక్ గ్రీన్‌కి 70 శాతం, టొనినోకి 30 శాతం వాటాలు ఉంటాయి. వచ్చే పదేళ్లలో అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ కార్ట్ వ్యాపారంలో 10% వాటాను సాధించాలని నిర్దేశించుకున్నట్లు కైనెటిక్ గ్రీన్ సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వాని తెలిపారు. అమెరికా, యూరప్, ఆసియావ్యాప్తంగా 25–30 మార్కెట్లలో ప్రవేశించడం ద్వారా వచ్చే అయిదేళ్లలో 300 మిలియన్ డాలర్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
వచ్చే ఏడాది వ్యవధిలో జాయింట్ వెంచర్ సంస్థ వివిధ మార్గాల్లో 20 మిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు వివరించారు. గోల్ఫ్ కోర్సులు, రిసార్టులు, ఎయిర్‌పోర్టుల్లో ఎలక్ట్రిక్ కార్టులను వాడతారు. ఇవి 80–150 కి.మీ. రేంజితో, 10,000–14,000 డాలర్లకు లభిస్తాయి. దేశీయంగా ఏటా 1,500 యూనిట్లు అమ్ముడవుతున్నాయి.