రూ.5 కోట్ల కారుతో పిల్లల ఆటలు.. కోర్టుకెక్కిన యజమాని! | Kids Damage Rs 5 Crore Ferrari in China Owner Sues Parents | Sakshi
Sakshi News home page

రూ.5 కోట్ల కారుతో పిల్లల ఆటలు.. కోర్టుకెక్కిన యజమాని!

Jul 4 2026 4:53 PM | Updated on Jul 4 2026 5:50 PM

Kids Damage Rs 5 Crore Ferrari in China Owner Sues Parents

పిల్లల చేష్టలు ఒక్కోసారి తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుంటాయి. ఇలాగే చైనాలో నలుగురు చిన్నారులు రూ.5 కోట్లకు పైగా విలువైన ఫెరారీ సూపర్‌కార్‌ను ఆటబొమ్మగా మార్చి ధ్వంసం చేసిన ఘటన సంచలనంగా మారింది. పిల్లల తల్లిదండ్రులు తగిన పరిహారం చెల్లించేందుకు నిరాకరించడంతో కార్ యజమాని సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కారంతా గీతలే..

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ సంఘటన చైనాలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నగరంలో జరిగింది. వ్యాపార పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో యజమాని తన ఎరుపు రంగు ఫెరారీ 488 జీటీబీ కారును ఆరుబయట పార్క్ చేశాడు. అతను తిరిగి వచ్చేసరికి పొరుగింటికి చెందిన 10 ఏళ్లలోపు నలుగురు పిల్లలు కారుపై ఎక్కి చిందరవందర చేసేశారు. కారు గ్లాస్‌పై జారుడు బల్లలా ఆడుకున్నారు. వెదురు కర్రలతో కారంతా గీతలు పెట్టేశారు.

కారు హుడ్, టాప్‌, ఫెండర్లు, టెయిల్‌లైట్లు, కిటికీలు సహా పలు భాగాలపై లోతైన గీతలు కనిపించాయి. ముందు బంపర్‌ కూడా చీలినట్లు వెల్లడైంది. స్థానిక రిపేర్ సెంటర్ల అంచనా ప్రకారం ఒరిజినల్ పార్ట్స్‌తో మరమ్మతులకు సుమారు 1 లక్ష యువాన్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.12 లక్షలు) వరకు ఖర్చవుతుందని సమాచారం. ప్రత్యామ్నాయ ఆఫ్టర్‌మార్కెట్ విడిభాగాలు ఉపయోగిస్తే ఈ వ్యయం కాస్త తగ్గే అవకాశం ఉంది.

రూ.60 వేలే ఇస్తామన్న తల్లిదండ్రులు

యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం రెండు దఫాల చర్చలు జరిగినప్పటికీ పరిష్కారం లభించలేదు. పిల్లల తల్లిదండ్రులు కేవలం 5,000 యువాన్‌లు (సుమారు రూ.60 వేల వరకు) మాత్రమే పరిహారంగా చెల్లించేందుకు సిద్ధమని చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి. అంతేకాక పిల్లల నుంచి క్షమాపణలు కూడా రాలేదని యజమాని ఆరోపించాడు. దీంతో పూర్తి మరమ్మతు ఖర్చును వసూలు చేసేందుకు సివిల్ దావా వేయాలని నిర్ణయించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement