బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర ఆర్థిక సంస్థల సేవలపై అసంతృప్తిగా ఉన్న వినియోగదారులకు ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. జులై 2026 నుంచి అమలులోకి రానున్న నూతన అంబుడ్స్‌మన్ పథకం ద్వారా బాధితులకు భారీ స్థాయిలో పరిహారం పొందే అవకాశం కల్పించింది.
పరిమితి లేని వివాద పరిష్కారం
కొత్తగా తీసుకువచ్చిన ‘రిజర్వ్ బ్యాంక్–ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ (RB-IOS) 2026’ ప్రకారం.. వినియోగదారుల ఫిర్యాదులో ఉన్న వివాదాస్పద మొత్తంపై ఇకపై ఎటువంటి గరిష్ట పరిమితి ఉండదు. అంటే, వివాదంలో ఉన్న మొత్తం ఎంత పెద్దదైనా అంబుడ్స్‌మన్ దాన్ని విచారించవచ్చు. అయితే, ఫిర్యాదు వల్ల కలిగిన నష్టాలకు (Consequential Loss) సంబంధించి అంబుడ్స్‌మన్ గరిష్టంగా రూ.30 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కలిగి ఉంటుంది. 2021 పథకం ప్రకారం ఇది రూ.20 లక్షలుగా ఉంది.
మానసిక వేదనకు అదనపు పరిహారం
కేవలం ఆర్థిక నష్టమే కాకుండా, ఫిర్యాదుదారుడు అనుభవించిన మానసిక వేదన, సమయం వృథా, ఖర్చులకుగానూ ప్రత్యేకంగా గరిష్టంగా రూ.3 లక్షల వరకు పరిహారం చెల్లించాలని అంబుడ్స్‌మన్ ఆదేశించవచ్చు. గతంలో ఇది రూ.1 లక్షగా ఉంది. కొత్త నిర్ణయం వినియోగదారుల పట్ల ఆర్థిక సంస్థల జవాబుదారీతనాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.
కీలక మార్పులు
ఈ సవరించిన పథకం జులై 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, నాన్-బ్యాంక్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్రొవైడర్లు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇది వర్తిస్తుంది. ఆర్‌బీఐ తన అధికారులను మూడు సంవత్సరాల కాలపరిమితితో అంబుడ్స్‌మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్‌మన్‌గా నియమిస్తుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం సెంట్రలైజ్డ్ రిసీప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ (CRPC) ఏర్పాటు చేస్తారు.
ఫిర్యాదు చేయడం ఎలా?
వినియోగదారులు తమ ఫిర్యాదులను డిజిటల్ లేదా ఫిజికల్ రూపంలో నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా https://cms.rbi.org.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్/నేరుగా సంబంధిత సెంట్రలైజ్డ్ సెంటర్‌కు పంపవచ్చు. ఈ కొత్త నిబంధనలు ఆర్థిక రంగంలో పారదర్శకతను పెంచుతాయని, సామాన్య వినియోగదారులకు బ్యాంకింగ్ వ్యవస్థపై మరింత నమ్మకాన్ని కలిగిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో వీధికుక్కల సామూహిక హత్యలు


