భారత మార్కెట్లో చిత్రమైన పరిస్థితి
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా పెరిగితేనే భారత్ ఆశించిన స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం సాధ్యపడుతుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. కార్పొరేట్ రంగం నిలకడగా పెట్టుబడులు పెంచడం దేశీయంగా కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. 50 శాతం టారిఫ్‌ల భారంతో అమెరికా–భారత్ బంధంపై అనిశ్చితి నెలకొనడం కూడా పెట్టుబడుల రాకకు కొంత ప్రతిబంధకంగా ఉండొచ్చని చెప్పారు. అది తొలగిపోతే అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో చురుగ్గా పాలుపంచుకునేందుకు వీలవుతుందని, భారత్‌కి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
గత కొన్నాళ్లుగా భారత మార్కెట్ కొంత పటిష్టంగా మారిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధిస్తున్న భారత్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న చిత్రమైన పరిస్థితిపై స్పందిస్తూ, ‘‘ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడులు పెడుతుంటే ఎఫ్‌డీఐలు వస్తాయి. కానీ ప్రైవేట్ రంగం ఇన్వెస్ట్ చేయడం లేదు. అంటే ఇక్కడ పరిస్థితి ఏదో సరిగ్గా లేదు. పాలసీపరమైన అనిశ్చితి కూడా కారణమనేది కొందరి అభిప్రాయం’’ అని రాజన్ చెప్పారు. గతేడాది వరుసగా నాలుగో నెల నవంబర్‌లో కూడా ఎఫ్‌డీఐ గణాంకాలు ప్రతికూలంగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ డేటా ప్రకారం ఆ నెలలో వచ్చిన ఎఫ్‌డీఐల కన్నా అధికంగా 446 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడులాంటి రాష్ట్రాలు ఎఫ్‌డీఐలను ఆకర్షించగలుగుతున్నప్పటికీ విస్తృత స్థాయిలో పెట్టుబడులు తరలిపోతుండటానికి కారణాలేమిటనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని రాజన్ పేర్కొన్నారు.
యూఎస్ ట్రెజరీలను తగ్గించుకుంటున్నది అందుకే..
సర్వత్రా అనిశ్చితి నెలకొనడం, కొన్ని విధానాలను ఉల్లంఘించేందుకు అమెరికా సంసిద్ధంగా ఉండటంలాంటి అంశాల వల్ల చాలా దేశాలు అమెరికా ట్రెజరీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుని, డైవర్సిఫికేషన్ వైపు మొగ్గు చూపుతున్నాయని రాజన్ చెప్పారు. అమెరికా ట్రెజరీల్లో భారత్ హోల్డింగ్స్ అయిదేళ్ల కనిష్టానికి పడిపోవడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సులభంగా మార్చుకునేందుకు వీలుంటుందనే నమ్మకం వల్లే డాలరు రిజర్వ్ కరెన్సీగా చెలామణీ అవుతోందని, కానీ ప్రస్తుతం ఆ నమ్మకం సడలుతోందని రాజన్ పేర్కొన్నారు. కానీ, బ్రిటన్, చైనా, జపాన్, రష్యాలాంటి దేశాలు సొంత సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో డాలరుకు దీటైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు. సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నప్పటికీ, అది బబుల్ స్థాయికి చేరిందేమోనన్న సందేహాలు తలెత్తుతున్నాయని రాజన్ చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్ రిజర్వుల్లో ఎక్కువభాగం డాలర్ బాండ్లే ఉంటాయని రాజన్ తెలిపారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..


