రిటైల్, వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈ (ఆర్‌ఏఎం) రుణాల విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈవో రమేష్ బాబు వెల్లడించారు. కార్పొరేట్ రుణాల విషయంలో మాత్రం ఆచితూచి ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ లోన్ పోర్ట్‌ఫోలియోలో ఆర్‌ఏఎం వాటా దాదాపు 86 శాతంగా, కార్పొరేట్ రుణాల వాటా సుమారు 14 శాతంగా ఉన్నట్లు చెప్పారు.
సోమవారం అయిదు రాష్ట్రాలవ్యాప్తంగా ఒకే రోజున 16 శాఖలను ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. వ్యవసాయ రుణాల్లో దాదాపు 90 శాతం గోల్డ్ లోన్స్ రూపంలోనే ఉండటం వల్ల, ఎల్‌నినోపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పోర్ట్‌ఫోలియోకు సమస్య ఉండబోదని రమేష్ బాబు చెప్పారు. కార్యకలాపాల విస్తరణ దన్నుతో ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమకు మించి రుణ వృద్ధిని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.
కార్పొరేట్ రంగం క్రమంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) కూడా ఊతం లభిస్తోందని, ఫలితంగా ఆ విభాగంలో రుణాలకు డిమాండ్ పెరుగుతోందని రమేష్ బాబు వివరించారు. ఇటీవలి కాలంలో మార్కెట్ వైపు మళ్లుతున్న కస్టమర్లను, బ్యాంకింగ్ వైపు ఆకర్షించే దిశగా మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాల్లాంటి వినూత్న సొల్యూషన్స్‌ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్టార్టప్‌ల కోసం త్వరలో ప్రత్యేక పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ..
కొత్తగా ప్రారంభించిన శాఖల్లో 5 ఆంధ్రప్రదేశ్‌లో, 3 తెలంగాణలో ఉన్నట్లు రమేష్ బాబు చెప్పారు. దేశవ్యాప్తంగా బ్రాంచీల సంఖ్య 919కి చేరగా, ఏడాది వ్యవధిలో దీన్ని 1,000కి పెంచుకోనున్నట్లు వివరించారు. తాము ప్రతి మూడు, నాలుగేళ్ల వ్యవధిలో రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపార వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 2026 జూన్ 30 నాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం రూ. 2,27,267 కోట్లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో మొత్తం 66 శాఖలు, రూ. 23,000 కోట్ల వ్యాపారం, ఆంధ్రప్రదేశ్‌లో 154 శాఖలు రూ. 24,600 కోట్ల మేర వ్యాపారం ఉంది.


