
ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం మరో సంచలనంతో ముందుకొచ్చింది. తక్కువ ధరలో డిజిటల్ ఉపకరణాలు కోరుకునే వినియోగదారులకు జియో ప్లాట్‌ఫాంస్ జియో పీసీ (JioPC) పేరుతో కొత్త ఆవిష్కరణను తెచ్చింది. ఇది ఒక క్లౌడ్ ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీసుగా పనిచేస్తూ మీ టీవీని పూర్తి స్థాయి కంప్యూటర్‌గా మార్చుతుంది.
ఈ ఏఐ (AI) ఆధారిత వర్చువల్ కంప్యూటింగ్ సర్వీస్ జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కీబోర్డ్, మౌస్‌ని ప్లగ్‌ఇన్ చేసి తమ టీవీలో డెస్క్‌టాప్ అనుభవాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్ చేయదు.
ధర, లభ్యత
జియోపీసీ ప్రస్తుతానికి ఉచిత ట్రయల్ ద్వారా ఎంపిక చేసిన వినియోగదారులకు అందిస్తోంది. పూర్తిగా పొందాలంటే రూ.5,499 చెల్లించి జియో బ్రాడ్‌బ్యాండ్‌తో పొందవచ్చు. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలను లక్ష్యంగా తీసుకుంటూ, కంప్యూటింగ్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నారు. క్లౌడ్ ఆధారిత కంప్యూటర్‌ను తీసుకొస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ గత మార్చిలోనే వెల్లడించారు.
ఫీచర్లు, వినియోగం ఇలా..
జియో వెబ్‌సైట్‌లో పేర్కొన్నదాని ప్రకారం.. లైబ్రేఆఫీస్ (LibreOffice) అనే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాంటి ఓపెన్-సోర్స్ ఆఫీస్ సూట్‌ను దీంట్లో ప్రీఇన్‌స్టాల్ చేసిఉంటారు. దీని ద్వారా బ్రౌజింగ్ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యాప్‌లను విడి బ్రౌజర్ ద్వరా ఉపయోగించవచ్చు. క్లౌడ్ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఏమీ ఉండదు.