
డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పదేళ్ల కిందట ఒక మూవీ లేదా ఏదైనా ఒకమోస్తారు లార్జ్‌ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయాలంటే చాలా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం క్షణాల్లో డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇటీవల జపాన్ పరిశోధకులు భారీగా ఇంటర్నెట్ స్పీడ్ లిమిట్‌ను పెంచి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని మొత్తం డేటా డౌన్‌లోడ్ చేసేంత నెట్‌స్పీడ్ వచ్చేలా పరిశోధనలు చేశారు.
జపాన్ పరిశోధకులు జరిపిన ఎక్స్‌పరిమెంట్ ప్రకారం ఇంటర్నెట్ వేగం సెకనుకు 1.02 పెటాబైట్లకు చేరుకుంది. జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐసీటీ) శాస్త్రవేత్తలు ఈమేరకు ప్రపంచ రికార్డు సాధించారు. మనలో చాలా మంది ఇంటర్నెట్ వేగాన్ని సెకనుకు మెగాబైట్స్ (ఎంబీపీఎస్)లో కొలుస్తారు. ఒక పెటాబైట్ ఒక మిలియన్ గిగాబైట్లకు సమానం లేదా ఒక బిలియన్ మెగాబైట్‌కు సమానం. కాబట్టి ఈ కొత్త రికార్డుతో సుమారు 1,020,000,000 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను అందించేలా పరిశోధనలు చేశారు. అమెరికాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ 300 ఎంబీపీఎస్ కాగా, భారత్‌లో 64 ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ కొత్త వేగం నెట్‌ఫ్లిక్స్ మొత్తం కంటెంట్ లైబ్రరీని సెకనులో డౌన్‌లోడ్ చేస్తుంది.
ఇదీ చదవండి: ఎవరు చెప్పినా వినండి.. కానీ..
ఎన్ఐసీటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్పీడ్‌ను సాధించేందుకు పరిశోధనా బృందం 19 కోర్లతో ప్రత్యేక రకం ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగించింది. ఇందులో 19 చిన్న ఛానళ్లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి డేటాను తీసుకెళ్లగలవు. సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కేవలం ఒక కోర్‌ను కలిగి ఉంటాయి. ఈ పరీక్ష స్వల్ప దూరానికే పరిమితం కాలేదు. ఈ టెస్టింగ్ ద్వారా 1,808 కిలోమీటర్లు (సుమారు 1,123 మైళ్లు) డేటాను ప్రసారం చేశారు. ప్రతి 86.1 కిలోమీటర్ల పొడవు ఉన్న 19 వేర్వేరు సర్క్యూట్ల ద్వారా సిగ్నల్‌ను లూప్ చేసే సెటప్‌ను ఉపయోగించారు. మొత్తం 180 డేటా స్ట్రీమ్‌లు ఒకేసారి ప్రసారం చేశారు. ఫలితంగా బ్యాండ్‌విడ్త్ కిలోమీటరుకు సెకనుకు 1.86 ఎక్సాబిట్లుగా నమోదైంది. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని సాధించవచ్చని నిరూపించడమే తమ లక్ష్యమని ఎన్ఐసీటీ తెలిపింది.