ఇవిగో ఈ తప్పులు చేశారో.. ఐటీ రిటర్న్ కొత్త రూల్స్‌.. | ITR New rules 200pc penalty prosecution for inaccurate or misleading returns | Sakshi
Sakshi News home page

ఇవిగో ఈ తప్పులు చేశారో.. ఐటీ రిటర్న్ కొత్త రూల్స్‌..

Jun 25 2025 4:56 PM | Updated on Jun 25 2025 5:27 PM

ITR New rules 200pc penalty prosecution for inaccurate or misleading returns

దేశవ్యాప్తంగా పన్నుచెల్లింపుదారులు ప్రస్తుతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్ (ఐటీఆర్) దాఖలులో తలమునకలై ఉన్నారు. ఐటీఆర్‌ ఫైలింగ్‌కు సాధారణంగా జూలై 31 చివరి తేదీ కాగా ఈ ఏడాది దీన్ని సెప్టెంబర్‌ 15 వరకూ పొడిగించారు. ట్యాక్స్‌ ఫైలింగ్‌లో సమ్మతి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించే విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

తప్పుడు మినహాయింపులు క్లయిమ్‌ చేసినా, ఆదాయాన్ని దాచినా పన్ను చెల్లింపుదారులకు కఠినమైన జరిమానాలను ప్రవేశపెట్టింది.  "పన్ను బకాయిలో 200% వరకు జరిమానా, 24% వార్షిక వడ్డీ, సెక్షన్ 276 సి కింద ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవచ్చు" అని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఈ పరిణామాలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను జాగ్రత్తగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

కొత్త నిబంధనలు.. కీలకాంశాలు

  • కఠినమైన జరిమానాలు: తప్పుదారి పట్టించే లేదా తప్పుడు ఐటీఆర్‌ దాఖలు చేసిన వారికి 200 శాతం జరిమానా, 24 శాతం వార్షిక వడ్డీ, సెక్షన్‌ 276సి ప్రకారం శిక్ష కూడా విధిస్తారు.

  • పన్ను చెల్లింపుదారుల బాధ్యత: సీఏ లేదా కన్సల్టెంట్ పొరపాటు చేసినా కూడా పన్ను చెల్లింపుదారుడే బాధ్యత వహించాలి.

  • అందరికీ వర్తింపు: ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, వ్యాపారులు, ప్రొఫెషనల్స్ అందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.

  • సాధారణ తప్పులు: తప్పు ఐటీఆర్‌ ఫారమ్ ఎంపిక, తప్పుడు మినహాయింపులు, ఆదాయాన్ని ప్రకటించకపోవడం జరిమానాలకు దారి తీస్తాయి.

  • రివైజ్డ్ రిటర్న్‌తోనూ లాభం లేదు: ఇచ్చిన సమాచారం తప్పుగా ఉందని పన్ను శాఖ గుర్తిస్తే, రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసినా జరిమానా తప్పదు.

  • సరైన ఐటీఆర్‌ ఫారమ్ ఎంపిక: ITR-1 (సాధారణ ఆదాయం), ITR-3 (వ్యాపార ఆదాయం) వంటి వివిధ ఫారమ్‌లు ఆదాయ రకాన్ని బట్టి ఎంచుకోవాలి.

  • తప్పు క్లెయిమ్‌లు చేయొద్దు: వ్యాపార ఖర్చులుగా వ్యక్తిగత ఖర్చులను చూపడం, తప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్‌లు జరిమానాలకు దారి తీస్తాయి.

  • పన్ను చెల్లింపుదారులకు జాగ్రత్తలు: వార్షిక సమాచార ప్రకటనలోని వివరాలతో సరిపోల్చుకోవడం, సరైన రికార్డులు నిర్వహించడం, పన్ను నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా జరిమానాలను నివారించవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement