
బీమా సంస్థలు, మధ్యవర్తులు నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించేందుకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఐఆర్‌డీఏఐ 132వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీమా చట్టం, నియంత్రణపరమైన మార్గదర్శకాలను బీమా కంపెనీలు సరిగ్గా పాటిస్తున్నాయా? ఎక్కడైన ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయా? అన్నది పరిశీలించేందుకు పూర్తికాల సభ్యులతో కూడిన ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఐఆర్‌డీఏఐ ప్రకటించింది.
పాలసీలను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తుండడం, డేటా లీకేజీ నివేదికల నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కివి జనరల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఆర్1 దరఖాస్తుకు సైతం తాజా సమావేశంలో ఐఆర్‌డీఏఐ ఆమోదం తెలిపింది. దీని తర్వాత ఆర్2, ఆర్3 స్థాయిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది.