స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు డౌన్‌.. | Sakshi
Sakshi News home page

స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు డౌన్‌..

Published Mon, Jul 10 2023 6:18 AM

Investments in startups are down - Sakshi

న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థల్లోకి ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్‌) పెట్టుబడులు 36 శాతం క్షీణించాయి. 3.8 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గత నాలుగేళ్లలో అర్థ సంవత్సరానికి సంబంధించి స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. వ్యాపారాలకు సంబంధించి ప్రతి కోణంపై ఇన్వెస్టర్లు మరింత క్షుణ్నంగా మదింపు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండటమే ఇందుకు కారణం పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

‘గతేడాది ప్రథమార్ధంలో నమోదైన 5.9 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఈసారి పెట్టుబడులు 36 శాతం క్షీణించి 3.8 బిలియన్‌ డాలర్లకు పరమితమయ్యాయి. 298 డీల్స్‌ కుదిరాయి. ఈ ఫండింగ్‌లో ప్రారంభ దశ స్థాయి డీల్స్‌ వాటా 57 శాతంగా ఉంది. ఫిన్‌టెక్, సాస్, డీ2సీ సంస్థల్లోకి అత్యధికంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది‘ అని రిపోర్టు పేర్కొంది. వెంచర్‌ క్యాపిటలిస్టులు (వీసీ) పుష్కలంగా నిధులు సమీకరించినా, స్టార్టప్స్‌లోకి పెట్టుబడులు రావడం మందగించింది.

అంకుర సంస్థల ప్రస్థానంలో ఇదొక దశ మాత్రమే. రాబోయే కొన్ని నెలల్లో మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్లు పుంజుకునే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఇన్వెస్టర్లు మరిన్ని విషయాలను మదింపు చేస్తున్నారు. ఫైనాన్స్‌ మొదలుకుని టెక్నాలజీ, హెచ్‌ఆర్, వ్యాపార ప్రక్రియలు మొదలైనవన్నీ చూస్తున్నారు. స్టార్టప్‌లలో పటిష్టమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటున్నారు‘ అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ అమిత్‌ నావ్‌కా తెలిపారు.  

నివేదికలోని మరిన్ని అంశాలు..
► ప్రథమార్ధంలో వీసీల పెట్టుబడులు తగ్గాయి. విలీన, కొనుగోలు (ఎంఅండ్‌ఏ) లావాదేవీలు దాదాపు గతేడాది ద్వితీయార్ధం స్థాయిలో సుమారు 80 డీల్స్‌ నమోదయ్యాయి. వీటిలో 80 శాతం దేశీ లావాదేవీలు కాగా మిగతావి సీమాంతర ఒప్పందాలు.
► సాస్‌ (23), ఫిన్‌టెక్‌ (11), ఈ–కామర్స్‌.. డీ2సీ (10) విభాగాల్లో అత్యధికంగా ఎంఅండ్‌ఏ డీల్స్‌ కుదిరాయి.  
► ప్రథమార్ధంలో వచి్చన పెట్టుబడుల విలువలో సాస్, డీ2సీ, ఫిన్‌టెక్, ఈ–కామర్స్‌ బీ2బీ, లాజిస్టిక్స్‌.. ఆటో టెక్‌ రంగాలు అత్యధికంగా 89 శాతం వాటా దక్కించుకున్నాయి.  
► బెంగళూరు, ఎన్‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌), ముంబై నగరాలు కీలక స్టార్టప్‌ సిటీలుగా కొనసాగుతున్నాయి. ప్రథమార్ధంలో స్టార్టప్స్‌లోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 83 శాతం వాటా దక్కించుకున్నాయి.   
  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement