ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025 విజేతల ప్రకటన | Infosys Prize 2025: Six Outstanding Researchers Honored for Breakthrough Contributions | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025 విజేతల ప్రకటన

Nov 14 2025 1:32 PM | Updated on Nov 14 2025 1:42 PM

Infosys Prize 2025 awarded to six scholars across six categories

విభిన్న రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన ఆరుగురు పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ (ISF) ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2025’ను ప్రకటించింది. ఆరు వేర్వేరు విభాగాల్లోని సమకాలీన పరిశోధకులు, శాస్త్రవేత్తల విజయాలను గుర్తించి ఏటా ఈ అవార్డును అందజేస్తారు. వీరి ప్రతిభను గౌరవిస్తూ ప్రతి ఒక్కరికీ బంగారు పతకం, ప్రశంసా పత్రం, 1,00,000 డాలర్లు (సుమారు రూ.88 లక్షలు)ఇస్తారు.

విజేతలు

ఫిజికల్ సైన్సెస్: కాల్‌టెక్‌లోని కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ ప్రొఫెసర్ కార్తీష్ మంతిరామ్ ఈ బహుమతిని గెలుచుకున్నారు. పునరుత్పాదక విద్యుత్తును ఉపయోగించి స్థిరమైన రసాయన ప్రక్రియలను సృష్టించడంపై ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది.

గణిత శాస్త్రం: ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన సవ్యసాచి ముఖర్జీ విజేతగా నిలిచారు. గ్రూప్ డైనమిక్స్, సంక్లిష్ట విశ్లేషణ వంటి గణితంలోని వివిధ రంగాలను అనుసంధానించే ఆయన పరిశోధన, నమూనాలకు గుర్తుగా ఈ గుర్తింపు లభించింది.

లైఫ్ సైన్సెస్: బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అంజనా బద్రినారాయణన్ విజేతగా నిలిచారు. జీవన వ్యవస్థలను స్థిరంగా, ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన ప్రక్రియలను అర్థం చేసుకోవడంలో సహాయపడే ఆమె పరిశోధనకు ఈ అవార్డు దక్కింది.

ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్: టొరంటో విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ సుశాంత్ సచ్‌దేవకు ఈ బహుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్, ఆరోగ్య సంరక్షణ, రవాణా వ్యవస్థల కోసం మెరుగైన అల్గోరిథమ్‌లను రూపొందించడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్: చికాగో విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రూ ఓలెట్‌కు ఈ అవార్డు దక్కింది.

ఎకనామిక్స్: ఎంఐటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్న నిఖిల్ అగర్వాల్ ఈ అవార్డును గెలుచుకున్నారు.

విజేతలను ప్రకటించిన సమావేశంలో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ట్రస్టీ, ఇన్ఫోసిస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ..‘పరిశోధన చేయడానికి ధైర్యం, పట్టుదల, ఊహ అవసరం. ఇది సైన్స్, సమాజం, విలువలు, నైతికతను వారధిగా ఉపయోగించుకుంటుంది. ఆకలి, పేదరికం, మూఢనమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాల్లోని సమస్యలను సైన్స్ మాత్రమే పరిష్కరించగలదు. భారతదేశాన్ని, ప్రపంచాన్ని మెరుగ్గా మార్చడానికి పరిశోధనే ఏకైక మార్గం’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement