భారతదేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థల్లో ఒకటైన ఫోన్ పే జనరేటివ్ ఏఐ (Generative AI) కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోన్ పే తన వినియోగదారుల కోసం చాట్ జీపీటీ ఫీచర్లను యాప్‌లో ఏకీకృతం చేయనుంది. ఫోన్ పే ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈమేరకు చర్యలు చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది.
ఈ భాగస్వామ్యం ద్వారా చాట్ జీపీటీ అత్యాధునిక సామర్థ్యాలను నేరుగా ఫోన్ పే యాప్, ఫోన్ పే ఫర్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి తేనున్నారు. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా వినియోగదారులు తమ ప్రయాణాలను ప్లాన్ చేయడం నుంచి షాపింగ్ చేయడం వరకు అనేక రోజువారీ అవసరాలపై ఏఐ సహాయంతో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఫోన్ పే వ్యవస్థాపకుడు, సీటీఓ రాహుల్ చారి మాట్లాడుతూ..‘వినూత్న కంపెనీల మధ్య సహకారం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడంలో సహాయపడుతుంది. పర్సనలైజ్డ్ సిఫార్సుల నుంచి ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ వరకు ఫోన్ పే పర్యావరణ వ్యవస్థలో చాట్ జీపీటీని ఏకీకృతం చేయడం ద్వారా యూజర్లు మెరుగైన డిజిటల్ సర్వీసులు పొందవచ్చు’ అని చెప్పారు.
మోసాల నివారణకు ఫోన్ పే ప్రొటెక్ట్
మరోవైపు, మోసపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించడానికి ఫోన్ పే ఇటీవల ఫోన్ పే ప్రొటెక్ట్ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ టూల్ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) డేటాను ఉపయోగించి పనిచేస్తుంది. దీని ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) ఫీచర్ ద్వారా DoT ప్రమాదకరమైనవిగా గుర్తించిన ఫోన్ నంబర్లకు చెల్లింపులను గుర్తించి నిరోధిస్తుంది.
హై రిస్క్‌గా లేబుల్ చేసిన నంబర్లకు చెల్లింపులను ఫోన్ పే స్వయంచాలకంగా బ్లాక్ చేస్తుంది. స్క్రీన్‌పై హెచ్చరిక సందేశాన్ని చూపుతుంది. మీడియం రిస్క్ నంబర్ల కోసం లావాదేవీని అనుమతించడానికి ముందు వినియోగదారులకు హెచ్చరిక సందేశాన్ని అందిస్తుంది. భద్రతా కారణాల వల్ల లావాదేవీని ఎందుకు నిరోధించారో ఫోన్ పే ప్రొటెక్ట్ వినియోగదారులకు స్పష్టంగా వివరాలు అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ జీవితాన్ని మార్చిన 10 పుస్తకాలు


