ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్‌! | IndusInd Bank Q4 Results Net loss of Rs 2329 crore | Sakshi
Sakshi News home page

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్‌!

May 22 2025 7:49 AM | Updated on May 22 2025 7:51 AM

IndusInd Bank Q4 Results Net loss of Rs 2329 crore

ముంబై: ప్రైవేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలనువీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 2,329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఖాతాల అవకతవకలతో ప్రొవిజన్లు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది.  2023–24 ఇదే కాలంలో రూ. 2,349 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు కొంతమంది ఉద్యోగుల పాత్రపై అనుమానాలతో బ్యాంక్‌ బోర్డు దర్యాప్తు ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలకు ఖాతాల మోసాలపై నివేదించమని బ్యాంక్‌ను ఆదేశించింది. 

ఖాతాల లోపాలు, మైక్రోఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోలో మోసం, బ్యాలెన్స్‌షీట్‌లో పొరపాటు అంశాలతో బ్యాంక్‌ సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అంతర్గత ఆడిట్‌కు ఆదేశించడం తెలిసిందే. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండస్‌ఇండ్‌ నికర లాభం 71% పడిపోయి రూ. 2,576 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 8,977 కోట్ల లాభం సాధించింది. ప్రొవిజన్లు రూ. 3,885 కోట్ల నుంచి రూ. 7,136 కోట్లకు పెరిగాయి.

ప్రొవిజనింగ్‌ జూమ్‌ 
క్యూ4లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ రూ. 2,522 కోట్లమేర ప్రొవిజనింగ్‌ చేపట్టింది. అంతక్రితం క్యూ4లో ఈ పద్దు రూ. 950 కోట్లు మాత్రమే.  2023–24 క్యూ4లో రూ. 12,199 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. డెరివేటివ్‌ పోర్ట్‌ఫోలియోలో రూ. 1,979 కోట్లమేర ఖాతాలలో లోపం, మైక్రోఫైనాన్స్‌ బిజినెస్‌లో రూ. 674 కోట్ల వడ్డీ తప్పుగా నమోదు చేసినట్లు అంతర్గత ఆడిట్‌లో గుర్తించడం, బ్యాలెన్స్‌షీట్‌లో రూ. 595 కోట్ల ఇతర ఆస్తుల అక్రమ పద్దు తదితరాలను బ్యాంక్‌ మార్చిలో వెల్లడించింది.

ఏప్రిల్‌ 29న సీఈవో సుమంత్‌ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్‌ ఖురానా రాజీనామా చేశారు. దీంతో బ్యాంక్‌ బోర్డు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు చేసింది.  2025 జూన్‌30లోగా కొత్త సీఈవో ఎంపికకు వీలుగా ప్రతిపాదనలు పంపమని బ్యాంక్‌ను ఆర్‌బీఐ ఆదేశించినట్లు ఇండస్‌ఇండ్‌ వెల్లడించింది.  ఫలితాల నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ షేరు 1.4% క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement